పాలమూరు, ఆగస్టు 22: కులమతాలకతీతంగా జాతికోసం పాటుపడిన మహనీయుడు రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం వెంకట్రామారెడ్డి జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ వద్ద ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. వెంకట్రామారెడ్డి పాలమూరులో జన్మించడం జిల్లావాసిగా గర్వపడుతున్నానని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ ఏర్పాటుచేసి అనేకమంది రైతు కుటుంబాలు, పేద విద్యార్థులకు విద్యనందించేందుకు కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తితోనే మిగతావారు కూడా వసతిగృహాలు, భవనాలు ఏర్పాటు చేశారని కొనియాడారు. అంబేద్కర్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, ఫూలే, పుచ్చలపల్లి సుందరయ్యలాంటి మహనీయులను కొన్ని కులాలు, మతాలకే పరిమితం చేయాలని చూడడం బాధాకరమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకల్లో కొ న్ని కులాలు, మతాలకు సంబంధించిన వారే కాకుండా అందరూ పాల్గొని నివాళులర్పించాలన్నారు. జిల్లాకు చెందిన పోరాటయోధుడు సురవరం ప్రతాపరెడ్డి కుటుంబాన్ని స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సన్మానించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు కట్టా రవికిషన్‌రెడ్డి, అనంతరెడ్డి, రెడ్డి సేవా సమితి నాయకులు ఇంద్రసేనారెడ్డి, పొద్దుటూరి ఎల్లారెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ సమస్యకు చెక్
జాతీయ రహదారుల విస్తరణతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎనుగొండలో రాంరెడ్డి కంటి దవాఖాన వద్ద నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులను సోమవారం మంత్రి డీసీసీబీ వైస్‌చైర్మన్ కోరమోని వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త రోడ్డు ఏర్పాటు చేసి పట్టణంలో కనెక్టివిటీని పెంచుతామని తెలిపారు. జడ్చర్ల-మహబూబ్‌నగర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య తీరిందన్నారు. ఎస్వీఎస్ దవాఖాన నుంచి భూత్పూర్ రోడ్డు వరకు ఉన్న బైపాస్ రోడ్డుకు జిల్లాకేంద్రంలోని వివిధ కాలనీల నుంచి లింక్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామన్నారు. భూత్పూర్ నుంచి కొత్తగా నిర్మితమయ్యే కోస్గి బైపాస్ వల్ల పట్టణంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. పట్టణంలో అంతర్గత రోడ్లు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చించోలి, అమ్రాబాద్ జాతీయ రహదారుల నిర్మాణంతో జిల్లాకేంద్రం జాతీయ రహదారులకు అడ్డాగా మారనున్నదన్నారు. రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.