అయిజ, ఆగస్టు 7: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. 30గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఇన్‌ఫ్లో 1,09,106 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,09,106 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం గల డ్యాంలో ప్రస్తుతం 101.304 టీఎంసీలు నిల్వ ఉన్నది. 1633అడుగుల గరిష్ట నీటిమట్టానికి గానూ, ప్రస్తుతం 1631.88అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన తుంగభద్ర డ్యాం నుంచి వరదనీరు దిగువకు విడుదల చేస్తుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరదనీరు నిలకడగా చేరుతున్నది. ఆనకట్టకు ఇన్‌ఫ్లో 1,01,013 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,00,600 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 413క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 12.9అడుగుల నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
జూరాలకు 40వేల క్యూసెక్కులు
అమరచింత, ఆగస్టు 7: మండలంలోని నందిమల్ల శివారులోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. ఆదివారం సాయంత్రానికి 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, వపర్హౌస్లోకి విద్యుదుత్పత్తికి 41,389క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. డ్యాం నీటినిల్వ 9,657టీఎంసీలు కాగా, భీమా లిఫ్ట్-650, ఎడుమ కాల్వకు 1060, కుడి కాల్వకు 519క్యూసెక్కులు విడుదల కాగా, మొత్తం 44వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలం మూడు గేట్ల నుంచి..
శ్రీశైలం, ఆగస్టు 7: ఎగువ నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. డ్యాం మూడు గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు నుంచి 41,389క్యూసెక్కులు, సుంకేశుల డ్యాం నుంచి 50,904 క్యూసెక్కులు మొత్తం కలిపి 92,293 క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్‌కు 1,52,670 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.60అడుగులకు చేరగా.. పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా.. 213.4011టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు. స్పిల్‌వే నుంచి 83,673క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 31,658క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 31,784క్యూసెక్కులు.. మొత్తం 1,47,115క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.