వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. మే 24 నుంచి దాదాపు 50 రోజులపాటు మూగబోయిన బడిగంట మళ్లీ మోగనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో ఈవిద్యాసంవత్సరంఆంగ్లమాధ్యమంలో బోధన సరికొత్తగా.. ‘మన ఊరు-మన బడి’ ఆధునీకరణ పనులతో ప్రారంభం కానున్నది. విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే జూలై 1 నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈనెలాఖరు వరకు బడుల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమంతో భారీగా విద్యార్థులు పాఠశాలల్లో చేరారు.
నాగర్‌కర్నూల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గ్రామాలు, పట్టణాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. సోమవారం నుంచి మళ్లీ బడిగంట మోగనుంది. మార్చి 23వరకు 2021-22విద్యా సంవత్సరం కొనసాగింది. మార్చి 24నుంచి దాదాపుగా 50రోజుల పాటు పాఠశాలలకు వేసవి సెలవులు కొనసాగాయి. పదో తరగతికి మే 23నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఎట్టకేలకు సోమవారం పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో హెచ్ఎంలు ముందురోజు ఏర్పాట్లు చేపట్టారు. కాగా ఈ విద్యా సంవత్సరం సరికొత్తగా ప్రారంభం కానుండటం గమనార్హం.
మనఊరు-మనబడి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల మరమ్మతులను చేపడుతున్నారు. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలను కార్పొరేట్ తరహాలో సౌకర్యాలు కల్పించేలా ఆధునీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వనపర్తిలో మార్చి 8వ తేదీన ఈ పథకానికి అంకురార్పణ చేయడం విశేషం. విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పలుమార్లు జిల్లాలో పర్యటించి పనుల శంకుస్థాపనలు, పనుల పర్యవేక్షణను పరిశీలించారు. ఇక కలెక్టర్లు సైతం పనుల పురోగతికి నిరంతరం ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదనపు తరగతి గదులు, వంట గదులు, టాయిలెట్లు, కంప్యూటర్ గదులు, తాగునీటి వసతి, ఫర్నీచర్లాంటి సదుపాయాలు కల్పించనున్నారు.
దీనికోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల్లో 40శాతం కేటాయించనుండటం గమనార్హం. ముఖ్యంగా ఆంగ్లమాధ్యమంలో బోధనకు చర్యలు తీసుకోవడం విశేషం. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణను పూర్తి చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం ఉచితంగా నాణ్యమైన భోజనం అందించనున్నారు. అలాగే ప్రతి విద్యార్థికి స్కూల్ డ్రెస్‌లను కూడా అందించనున్నారు. త్వరలో దుస్తులు చేరనున్నాయి. ఇక విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు డీఈవో కార్యాలయాలకు చేరుతున్నాయి. ఈవారంలో 50శాతం వరకు పుస్తకాలు జిల్లాలకు చేరనుండగా నెలాఖరుకు మండలాలకు చేరవేయనున్నారు.
ఆలోగా బ్రిడ్జికోర్సులు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా పై తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థులు, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను చదవాల్సి ఉంటుంది. అలాగే డిజిటల్ పాఠ్యాంశాలతో పాటు ముఖాముఖి తరగతులు సైతం నిర్వహిస్తారు. ఒకటి, రెండో తరగతులను మినహాయించి 10వ తరగతి వరకు నాలుగు స్థాయిలుగా విభజించి రోజుకు ఆరు పీరియడ్లుగా గతంలోని పాఠాల ముఖ్యాంశాలను బోధిస్తారు. టీశాట్ ద్వారా డిజిటల్ పాఠాలను కొనసాగించనున్నారు. ఇక జూలై 1నుంచి రెగ్యులర్ పాఠ్యాంశాల బోధన ఉండనుంది.
కాగా బడిబాట ద్వారా బడి ఈడు పిల్లలను స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. ఈనెల 3వ తేదీ నుంచి ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతున్నారు. కలెక్టర్, డీఈవోలాంటి జిల్లా అధికారులు బడి బాటను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. దీనివల్ల పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 885 ప్రభుత్వ పాఠశాలలుండగా 71వేల మంది వరకు విద్యార్థులు అభ్యసించనున్నారు. ఇందులో కేజీబీవీ, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుకులాల్లో 18,858మంది చదువుతున్నారు. ఇక 166ప్రైవేట్ పాఠశాలల్లో 35,876మంది అభ్యసిస్తున్నారు. మనఊరు-మన బడి పథకం ద్వారా తొలి విడుతలో 290పాఠశాలలను ఆధునీకరిస్తున్నారు. ఇక బడిబాటలో భాగంగా 1984మంది ప్రభుత్వ పాఠశాలలో చేరారు.
వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలల్లో బడిగంట మోగనుంది. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను పండుగ వాతావరణంలో తెరవాలని అధికారులు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని కలిగించేలా తోరణాలు కట్టి ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. జూన్ 1 నుంచి జయశంకర్ బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటా తమ పాఠశాలల ప్రత్యేకతను తెలుపుతూ కరపత్రాలు, బ్యానర్లతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
వనపర్తి జిల్లాలో మొత్తం 369 ప్రాథమిక పాఠశాలలు, 115 ఉన్నత పాఠశాలలు, 136 ప్రాథమికోన్నత పాఠశాలలు, 80 సెకండ్ గ్రేడ్ పాఠశాలల్లో మొత్తం 708 పాటశాలలకు గాను 84,773 మంది విద్యార్థులు గత ఏడాది నమోదయ్యారు. అందులో 152 ప్రైవేట్ పాఠశాలలు పోగా 509 మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, 15 కేజీబీవీలు, 3 మైనార్టీ , 3 బీసీ గురుకుల, 5 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, 3 మోడల్ స్కూల్స్ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా 1-8 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభంకానుంది. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకే ఆంగ్ల, తెలుగు మాధ్యమాలలో విద్యార్థులను చేర్చుకుంటున్నారు.
సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 885ప్రభుత్వ, 166ప్రైవేట్‌తో పాటుగా గురుకులాల్లో తరగతులు ప్రారంభమవుతాయి. మనఊరు-మనబడి ద్వారా జిల్లాలో రూ.82కోట్లతో 290పాఠశాలల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. బడిబాటలో భాగంగా 1984మంది పాఠశాలల్లో చేరారు.
– గోవిందరాజులు, డీఈవో