నాగర్‌కర్నూల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 19,711మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 84కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన పరీక్షలకు 92.09 శాతంతో 18,152మంది హాజరుకాగా 1,559మంది గైర్హాజరయ్యారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9:30 నుంచి 12గంటల వరకు నిర్వహించారు. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్షలు రాసేందుకు ఉదయమే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు.
పేపర్-1 పరీక్షకు 11,216మందికి గానూ 92.12శాతంతో 10,333మంది హాజరుకాగా 883మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 8,495మందికిగానూ 92.5శాతంతో 7,819మంది హాజరు కాగా 676మంది మాత్రమే గైర్హాజరయ్యారు. టెట్‌కు 90శాతంకుపైగా హాజరుకావడం విశేషం. నియోజకవర్గాల వారీగా చూస్తే.. నాగర్‌కర్నూల్‌లో 36కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 8,640మందికి గానూ 83,06మంది హాజరయ్యారు. 330మంది గైర్హాజరయ్యారు. కల్వకుర్తిలో 24కేంద్రాల్లోని జరిగిన పరీక్షలకు 5,760మందికిగానూ 5,559 మంది హాజరుకాగా 201మంది గైర్హాజరయ్యారు. ఇక అచ్చంపేటలో 17కేంద్రాల్లో 4,155మందికిగానూ 3,928 మంది హాజరుకాగా 227మంది గైర్హాజరయ్యారు.
కొల్లాపూర్‌లో 7పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1,396 మందికి గానూ 123మంది గైర్హాజరుకాగా 1,273మంది హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. కాగా జిల్లా కేంద్రంలోని గీతాంజలి, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఉదయ్‌కుమార్ పరిశీలించారు. కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్న తీరు, ఏర్పాట్లను డీఈవో గోవిందరాజులును అడిగి తెలుసుకొన్నారు.
వివిధ కేంద్రాల్లోని పరీక్షలను ప్రాంతీయ విద్యా సంచాలకులు విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్‌కుమార్, జిల్లా పరీక్షల అధికారి రాజశేఖర్ రావు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, సెక్టోరల్ అధికారి సూర్యచైతన్య, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ నాగరాజు, వెంకటేశ్వర్లు శెట్టి తదితరులు పర్యవేక్షించారు. ఈ పరీక్షలను 1,764మంది సిబ్బంది నియమించారు. జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఉపాధ్యాయ అర్హత పోటీ పరీక్షలు జరగడం విశేషం. ఈ పరీక్షలతో జిల్లా కేంద్రంతో పాటుగా నియోజకవర్గ కేంద్రాలు ఆదివారమైనా రద్దీగా మారాయి.
కల్వకుర్తి రూరల్, జూన్ 12 : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్( టెట్ ) పట్టణంలోని పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోమొత్తం 12 కేంద్రాల్లో 2,880 మంది అభ్యర్థులు పేపర్ -1, పేపర్-2 పరీక్షకు కేటాయించినట్లు ఎంఈవో బాసునాయక్ తెలిపారు. పేపర్-1 ఉదయం 9:30 నుంచి 12గంటల వరకు పరీక్ష నిర్వహించగా, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి 5గంటల వరకు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లోనికి విద్యార్థులను నిర్ణీత సమయానికి గంట ముందే అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.