పాఠశాలల ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు వచ్చాయి. వనపర్తి జిల్లాకు ఇప్పటికే చేరాయి. జిల్లాకు 3.80 లక్షలకుపైగా పుస్తకాలు అవసరం ఉండగా.. ఇప్పటికే లక్షకుపైగా చేరగా.. ఇంకా 2.80 లక్షలు రానున్నాయి. అందులో విద్యా కరికులం ఆధారంగా ఎఫ్ఏ-1,ఎఫ్ఏ-2 వరకు చేరుకున్నాయి. నూతనంగా ద్విభాషా పద్ధతిలో వీటిని ముద్రించారు.
వనపర్తి టౌన్, జూన్ 12: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించేలా మెనూ కూడా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, నాణ్యవంతమైన విద్య అందించాలనే సంకల్పంతో ఈ ఏడాడి కూడా ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేస్తుంది. అందులోబాగంగా ఈ ఏడాది 1-8వ తరగతి వరకు మన ఊరు-మన బడి, మన పాఠశాలలో బాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల సంపాదనతో విద్యార్థుల చదువు కోసం వ్యయాన్ని తగ్గించి ప్రభుత్వమే నాణ్యవంతమైన ఆంగ్లం, తెలుగు మాధ్యమాలలో బోధన సాగించాలనే ఉన్నత లక్ష్యంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ చేతుల్లో పడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోవద్దనే ఆంగ్ల మాధ్యమాన్ని సర్కారు బడుల్లోనే ప్రారంభించింది.
గతేడాది తెలుగు మాధ్యమంలో పుస్తకాల ముద్రణ జరిగేది. సక్సెస్ పాఠశాలలో ఆంగ్ల బోధన కొనసాగుతుండగా అలాంటి పాఠశాలకు ప్రత్యేకంగా ఆంగ్ల మాధ్యమంలోనే పుస్తకాలు ముద్రణ అయ్యేవి. ప్రతి ఏడాదికి భిన్నంగా ఈ ఏడాది మన ఊరు-మన బడిలో భాగంగా ఈ ఏడాది 1-8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నక, ఉన్నత పాఠశాలల్లో సమాంతరంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన తప్పనిసరి చేయ్యడంతో పాఠ్యపుస్తకాల ముద్రణ ద్విభాషా పద్ధతిలో ముద్రించారు. దీంతో ముద్రణలు ఆలస్యమవ్వడం, కరికులం ఆధారంగా ఎప్పటికప్పుడు రెండు, మూడు విడుతల్లో పుస్తకాలను పంపిణీ చేపడుతున్నారు. అందులోభాగంగా వనపర్తి జిల్లాకు ఎఫ్ఏ-1, ఎఫ్ఏ-2 వరకు పాఠ్య పుస్తకాలు చేరాయి.
పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ఫార్మాట్ 1,2కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతాయి. వచ్చే వారం మండల పాయింట్‌కు పాఠ్యపుస్తకాల అందజేస్తాం. జయశంకర్ బడిబాట పూర్తయ్యేలోపు పాఠశాలల్లో పంపిణీ కార్యక్రమం చేపడుతాం. ఇప్పటికీ జిల్లాకు లక్ష పుస్తకాలు చేరాయి.
– రవీందర్ డీఈవో, వనపర్తి