అచ్చంపేట, జూన్ 12 : దేశానికి దిశా నిర్దేశం చూపేందుకు సీఎం కేసీఆర్ వెంటనే కొత్త జాతీయ పార్టీని ప్రకటించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రాములుతో కలిసి విప్ గువ్వల ప్రెస్మీట్లో మాట్లాడారు. ఇన్నాండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఖరి, విధానాలతో ప్రజలు విరక్తి చెందారని చెప్పారు. అందుకే ప్రత్యామ్నాయంగా కొత్త జాతీయ పార్టీ కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చేందుకు గొప్ప సంకల్పంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి, శూన్యతపై గొప్ప నిర్ణయం ప్రకటించాలని సమాజం కోరుకుంటున్నారు. ఏది ఏమైనా దేశంలో జరుగుతున్న అరాచకాలు, ఆగడాలు, దుర్మార్గాలు, పేదలు, దళితులపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న విధానాలు క్షమించరానివని అన్నారు. దేశ ప్రజల బాగోగుల గురించి ఆలోచించి దేశాన్ని నడిపించే నాయకుడు, నాయకత్వం కరువైందన్నారు. మరో ప్రత్యామ్నాయం దేశ రాజకీయాల్లో అవసరమనే చర్చ జరుగుతుందని చెప్పారు. మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌కు అన్ని అంశాల్లో అవగాహన ఉండడంతోపాటు ఎనిమిదేండ్లుగా సీఎంగా గొప్ప పరిపాలన అందిస్తూ అనేక పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు.
ఇవే పథకాలు దేశవ్యాప్తంగా అందించేందుకు తనదైన శైలిలో పాత్ర పోషించాలని కోరారు. ఇటీవల సీఎం కేసీఆర్ జరిపిన సుదీర్ఘమైన చర్చలో ముక్తకంఠంతో టీఆర్ఎస్ పార్టీ, మంత్రివర్గం, ముఖ్యనేతలు అందరూ కేసీఆర్‌కు విన్నవించారని తెలిపారు. తెలంగాణను సాధించిన స్ఫూర్తితో యావత్ దేశ ప్రజలను కాపాడేందుకు అపార అనుభవం కలిగిన కేసీఆర్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాల్లో దశ, దిశ మార్పు కోసం రైతుబాంధవుడు బయలుదేరాలని కోరారు.
దేశ ప్రజలు ఆశిస్తున్న గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఒరిగేదేమి లేదని ఆయన విమర్శించారు. ఏకచత్రాధిపతి అనే ధోరణి మంచి పద్ధతి కాదన్నారు. అనంతరం ఎంపీ రాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దేశం నాశనానికి దారి తీసిందన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని ఆదాని, అంబానీలకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లకు గండిపడిందన్నారు. క్రమంగా రిజర్వేషన్ ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు.
బీజేపీ రాష్ర్టాల హక్కులు, స్వేచ్ఛను హరిస్తుందని ధ్వజమెత్తారు. దేశ ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఆలోచించి నడుంబిగించి బీజేపీయేతర రాజకీయ పక్షాలను ఏకం చేసి దేశానికి రక్షించాలని కోరారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే కేవలం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. ఎందుకంటే కేసీఆర్‌కు ఉన్న ప్రజ్ఞాపాటవాలు, అపారమైన అనుభవం, భాషా పట్టుదల, రాజ్యాంగంపై ఉన్న నమ్మకం, అన్ని రాజకీయ నేతలను ఒప్పించే శక్తి ఉందన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసీరాం, జెడ్పీటీసీలు మంత్రియానాయక్, ప్రతాప్‌రెడ్డి, భూపాల్‌రావు, రవీందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చెన్నకేశవులు, గోపాల్‌నాయక్, లోక్యానాయక్, అమీనొద్దీన్, పర్వతాలు, రమేశ్‌రావు పాల్గొన్నారు.