ఉమ్మడి జిల్లాలో టెట్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 297 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష కొనసాగింది. పేపర్-1కు 49,151 మంది అభ్యర్థులు హాజరుకాగా.. పేపర్-2కు 35,178 మంది కలిసి మొత్తం 84,329 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 5,911 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ పరీక్షలతో జిల్లా కేంద్రాలతోపాటు పాటు నియోజకవర్గ కేంద్రాలు రద్దీగా మారాయి.
మహబూబ్నగర్/జడ్చర్లటౌన్, జూన్ 12 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 79 కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షకు 18,923 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండ గా, 17,898మంది హాజరయ్యారు. పరీక్షకు 1,025మంది గైర్హాజరయ్యారు. అలాగే పేపర్-2 పరీక్షకు 13,719మంది హాజరు కావాల్సి ఉండగా, 13,021మంది హాజరయ్యారు. 698మంది పరీక్షకు హాజరుకాలేదు.
టెట్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారు లు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆఫెక్స్, తక్షశిల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావు తనిఖీ చేశారు. అలాగే జడ్చర్లలోని బాదేపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సీతారామారావు పరిశీలించారు. జడ్చర్లలో తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,603మంది అభ్యర్థులకుగానూ 2,417 మంది పరీక్షకు హాజరయ్యారు.
186మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో టెట్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంఈవో మంజులాదేవి పాల్గొన్నారు.