నాగర్‌కర్నూల్, జూన్ 11 : నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలో వెలిసిన రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. మూడ్రోజులపాటు కనుల పండువగా నిర్వహించారు. చివరి రోజు మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణం తదితర పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఆలయ ఆవరణలో చంద్రపుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.
స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవలో పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. స్వామి శంఖ చక్రాలను కోనేరులో చక్రస్నానం చేయించారు. అనంతరం భక్తులు కోనేరులో స్నానమాచరించారు. రాత్రి సప్తవర్ణాలు కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి.
కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ధర్మకర్త రంగాచార్యులు, సర్పంచ్ నిరంజన్, అర్చకుడు వినోదాచార్యులు, కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, వరదయ్య, చంద్రనారాయణ, శ్రీధర్‌రెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, సునీల్, మాధవరెడ్డి, వెంకట్రాంరెడ్డి, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.