నాగర్‌కర్నూల్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. గత యాసంగి సీజన్లో రైతులు వరిని విస్తృతంగా సాగు చేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలన్న దురుద్దేశంతో కేంద్రం ధాన్యం సేకరణకు నిరాకరించగా.., సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. తెలంగాణ రైతన్నలను ఆదుకొనేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఆదేశించారు. దీంతో నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి సింగిల్‌విండోలు, మార్కెట్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టారు.
ఈనెల 15వ తేదీతో కొనుగోళ్లు దాదాపుగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గతంలో మాదిరిగానే గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. వరికి ప్రభుత్వం క్వింటాకు రూ.1,960 మద్దతు ధర చెల్లిస్తున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,87,838 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు అంచనా వేశారు. అయితే, ఇప్పటివరకు 14,520 మంది రైతుల నుంచి 86,434 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
రైతులకు రూ.111 కోట్లకు గానూ రూ.92 కోట్లను చెల్లించారు. వచ్చే ఐదారు రోజుల్లో ఈ కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం దాదాపుగా తగ్గింది. కొందరు రైతులు ప్రైవేట్‌గా విక్రయించుకొన్నారు. ఫలితంగా ధాన్యం కొనుగోళ్లు తగ్గినట్లుగా అధికారులు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 99,178 ఎకరాల్లో వరి సాగు చేయగా.., 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికిగానూ లక్ష మెట్రిక్ టన్నులు సేకరించినట్లు అధికారులు తెలిపారు.
అలాగే నారాయణపేటలో 95,932 ఎకరాల్లో 2.30 లక్షల మెట్రిక్ టన్నులకుగానూ 1.10 లక్షలు, వనపర్తిలో 68,560 ఎకరాల్లో 1.80 లక్షల మెట్రిక్ టన్నులకుగానూ 1.10 లక్షలు, జోగుళాంబ గద్వాలలో 46,129 ఎకరాల్లో 1.15 లక్షల మెట్రిక్ టన్నులకుగానూ లక్ష మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో వరి, పత్తి, నూనె, పప్పుగింజల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. మొత్తమ్మీద ధాన్యం కొనుగోళ్లు ఈ వారంలో ముగియనున్నాయి.