వనపర్తి రూరల్, జూన్ 11 : భూసారాన్ని బట్టి పం టలు వేసుకోవాలని తెలంగాణ సర్కార్ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఏటా ఒకే రకమైన పంటలతో భూ సారం తగ్గి పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని సూచిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయ పంటలు సా గు చేయాలని రైతులకు శిక్షణ ఇస్తున్నది. యాసంగిలో వరి కోతల అనంతరం కొయ్యలను కాల్చడం వల్ల కలిగే న ష్టాలపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భూసారం కోల్పోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, యాజమాన్య పద్ధతులను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేయ డం, అనాలోచితంగా వ్యవహరించడంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. వరి కోతల తరువాత మిగిలిన కొ య్యలను కాల్చి బూడిద చేయడంతో ఏ మాత్రం ప్ర యోజనం ఉండదు. పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో భూమి విపరీతంగా వేడెక్కి భూసారం కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల దాక కోసేవారు. కోత తరువాత గడ్డిని పశుగ్రాసం కోసం కుప్పలు కుప్పలుగా నిల్వ చేసేవారు. క్రమంగా సాగు విధానంలో అనేక మార్పులు వచ్చాయి. పశువుల సంఖ్య తగ్గిపోవడంతోపాటు కూలీల సమస్య ఉత్పన్నమైంది. దీంతో వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరిగింది. మిషన్‌తో వరి కోతలు చేయడంతో కొయ్య లు పెద్దగా మిగిలిపోతున్నాయి. పొలం దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయన్న నెపంతో వరి కొయ్యలతోపాటు గడ్డిని సైతం పొలంలోనే కాలుస్తున్నారు. దీంతో భూమిలో సహజ సిద్ధంగా ఉండే నత్రజని, ఫాస్పరస్ వంటి పోషకాలు తగ్గుతున్నాయి. ఫలితంగా పంట దిగుబడిపై ప్రభావం పడుతున్నది. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు మంటలో కాలిపోవడంతో పంటకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటున్నాయి.
వరి కొయ్యలను కాల్చడంతో ఒక్కోసారి జీవరాసుల ప్రాణాలకు హాని జరిగే అవకాశాలూ ఉం టాయి. ముఖ్యంగా పొలాల్లో తిరిగే పాములు, ఉడుములు, నెమళ్లు, తొండలు, పశుపక్ష్యాదులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. తద్వారా ప్రకృ తి సమతుల్యత దెబ్బతింటుంది. పొలాల గ ట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చె ట్లు కాలిపోవడంతో పర్యావర ణం దెబ్బతింటుంది. గాలి, నేల కలుషితమవుతుంది. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు మరణిస్తాయి.
సరైన అవగాహన లేక రైతులు కొయ్యలను కాల్చి భూమికి హాని కలిగిస్తున్నారు. అవగాహనతో మెలగడం లేదు. వరి కొయ్యలను పొలంలో కలియదున్నడంతో కలిగే ప్రయోజనాలను గ్రహించలేకపోతున్నారు. కొయ్యలను కలియదున్నితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. దున్నే ముందు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే కొయ్యలు ఎరువుగా మారి పంట దిగుబడి పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. సేంద్రియ కర్బన శాతం పెరిగి 5 నుంచి 10 శాతం వరకు దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
– సుధాకర్‌రెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి, వనపర్తి