KV Anudeep | టాలీవుడ్లో కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే విక్టరీ వెంకటేష్, తనదైన మార్క్ ‘సెటైరికల్’ హాస్యంతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు కేవీ అనుదీప్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుదీప్, ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో తెరకెక్కించిన ‘ఫంకీ’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అనుదీప్ తన తదుపరి చిత్రాలపై స్పందిస్తూ, వెంకటేష్ గారి కోసం ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.
గతంలో అనుదీప్ వెంకటేష్‌కు ఒక కథను వినిపించగా, ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. అయితే, స్క్రిప్ట్‌లో మరిన్ని మెరుగులు దిద్దాలని వెంకీ సూచించడంతో, ప్రస్తుతం అనుదీప్ ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్ వెర్షన్ సిద్ధమయ్యాక మరోసారి నేరేషన్ ఇచ్చి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. వెంకీమామ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ క్రైమ్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. దీనితో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక ఎంటర్టైనర్, అలాగే ‘దృశ్యం 3’ కూడా లైన్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతే అనుదీప్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.