మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 11 : ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9:30నుంచి 12గంటలవరకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2:30నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షకు 18,923మంది అభ్యర్థులు హాజరుకానుండగా, వీరికోసం 79 పరీక్షాకేంద్రాలు, పేపర్-2 పరీక్షకు 13,642మంది అభ్యర్థులకుగానూ 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 32,642మంది టెట్ పరీక్షకు హాజరుకానున్నారు.
టెట్-1, 2కు సంబంధించి 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు 12మంది రూట్ ఆఫీసర్లు, 79మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 79మంది డిపార్ట్మెంట్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాలను శనివారం డీఈవో ఉషారాణి పరిశీలించారు. టెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహం తలెత్తినా హెల్ప్‌డెస్క్ 9441377725, 9966687842 నెంబర్లను సంప్రదించాలని డీఈవో కోరారు.