మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 11: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం సమీపంలోని తిరుమల కుచ్చతండాలో రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పల్లె,పట్టణ ప్రగతిలో క్రీడా ప్రాంగణాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
తండాల్లో ప్రస్తుతం ఉన్న ఇండ్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా శాశ్వత లేఅవుట్ కల్పించి ప్రభుత్వం ద్వారా ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థికసాయం ఇవ్వాల్సిందిగా తండావాసులు మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి లేఅవుట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు విద్యార్థులకు ఆటలు ఆడించి, తండాలో పర్యటించి సమస్యలు తెలుసుకొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్ లతశ్రీ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎంఈ సుబ్రహ్మణ్య, డీవో బెంజిమెన్, నాయకుడు లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.
మినీట్యాంక్ బండ్లో చేపట్టిన ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం మినీట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్ పాల్గొన్నారు.