గద్వాల, జూన్ 11: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గట్టు ఎత్తిపోతల పథకం, రాష్ట్ర రాజకీయాలపై మతి భ్రమించి మాట్లాడుతుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గట్టు ఎత్తిపోతల పథకం తామే సాధించామని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతలకు సంబంధించి ఒక్క జీవో చూయించిన తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అందుకు డీకే అరుణ సిద్ధమా అని సవాల్ విసిరారు. అధికారం, పదవీ లేక పోవడంతో అరుణ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందన్నారు.
రాజకీయ పబ్బం గుడుపుకోవడానికి నెలకోసారి ప్రెస్‌మీట్ పెట్టి కాలం వెళ్లదీస్తుందన్నారు. కేంద్రం రాష్ర్టాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వక పోతే కేంద్రంపై పోరు సాగిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకరాలేని బీజేపీ నేతలు మాపై విమర్శలు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. గట్టు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిల బెట్టుకున్నారని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల గట్టు ఎత్తిపోతల పథకం పనులు ఆలస్యమయ్యాయే తప్పా వేరే కారణం లేదని చెప్పారు.
భూ సేకరణ చేయకుండా పనులు చేస్తున్నారని డీకే అరుణ అంటున్నారని అది ఆమె అవగాహన లేమికి నిదర్శనమన్నారు. మూడు టీఎంసీలతో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోథల పథకానికి సేకరించిన భూమి మొత్తం ప్రభుత్వానిదని కొంత మేర ప్రైవేట్ రైతుల భూమి ఉందన్నారు. గట్టు భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని గుట్ట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు రూ.8లక్షలపైనే నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణను ఎండబెట్టి రాయలసీమకు నీరు తీసుకెళ్లడానికి సీమాంధ్ర పాలకులు ప్రయత్నించిన సమయంలో హారతులు పట్టిన అరుణ ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం, టీఆర్ఎస్పై చిల్లర మాటలు మాట్లాడుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీలు విజయ్‌కుమార్, ప్రతాప్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి, శ్రీనివాసులు నాయకులు గోవిందు, శంకర్ పాల్గొన్నారు.