గద్వాల, మే 30: కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో రాములు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను ఆర్డీవో స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ధరణి’కి సంబంధించినవి 15, ఇతర సమస్యలపై 22 వచ్చాయని చెప్పారు. ప్రజావాణిలో స్వీకరించిన భూ సమస్యలు, పింఛను ఇతర సమస్యల ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు పంపుతామని, క్షేత్రస్థాయిలో విచారించి న్యాయం జరిగేలా కృషి చేస్తారని తెలిపారు. బాధితులు ఒకసారి ఇచ్చిన ఫిర్యాదులు పదేపదే ఇవ్వరాదని సూచించారు. ప్రజావాణికి వచ్చే ప్రతిసమస్యకూ అధికారులు పరిష్కారం చూపుతారని తెలిపారు. ప్రజాసమస్యలపై అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.