నాగర్‌కర్నూల్, మే 30: ప్రజల రక్షణ, భద్రత లక్ష్యంగా నేరాల అదుపుకోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్‌శాఖ ప్రజల భాగస్వామ్యంతో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తుందని కలెక్టర్ ఉదయ్‌కుమార్ అన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,555 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎస్పీ, డీజీపీ కార్యాలయాలకు అనుసంధానం చేసి నేటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ మనోహర్, అదనపు కలెక్టర్ మనూచౌదరితో కలిసి కలెక్టర్ సోమవారం ప్రారంభించారు.
అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రధాన కూడళ్ల సీసీ కెమెరాల ఫుటేజీలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరగాళ్ల కదలికలే కాకుండా ఘటన సమాచారం, నిందితుడు వెళ్లిన దారిని గుర్తించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని దీంతో ఎలాంటి కేసులనైనా చేధించేందుకు వీలు కలుగుతుందన్నారు. నూతన కలెక్టర్ భవనం ప్రారంభమయ్యాక తమ కార్యాలయం తరఫున కూడా నేను సైతం అనే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం ఎస్పీ మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నియామాలు పాటించని వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారు, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అనుమతి లేని చోట వాహనాల పార్కింగ్ చేయడం వంటివి గుర్తించి వారిపై ఈ చలానా విధిస్తామని ఎస్పీ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రూ.18 లక్షలతో ఏర్పాటు చేసిన 1,555 సీసీ కెమెరాల విజువల్స్‌ను నేరుగా డీజీపీ కార్యాలయంలో వీక్షించేలా అనుసంధానం చేశామని తెలిపారు.
నేరాల అదుపు చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన 253 సీసీ కెమెరాలను డీజీపీ కార్యాలయానికి ఇప్పటికే అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్రావు, డీఎస్పీ మోహన్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ దీపక్‌చంద్ర, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్, మే 30: ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు సత్వర పరిష్కారమార్గాలు చూపాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్లు మనూచౌదరి, మోతీలాల్‌తో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 47 ఫిర్యాదులు వచ్చాయని, సంబంధిత శాఖల అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.