బాలానగర్, ఆగస్టు 25: ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం మండలకేంద్రంలోని తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికీ 187దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలని తాసిల్దార్ శ్రీనివాసులకు సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటిస్తున్నా రా అని ఎంపీడీవో కృష్ణారావును ప్రశ్నించారు.
ఉదయం 11గంటలకు కూడా సీనియర్ అసిస్టెంట్ రాకపోవడంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అక్కడి నుంచి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి అక్కడ ఎవరూ లేకపోవడంతో పాఠశాలకు సెలవు ఎవరిచ్చారని హెచ్ఎం గోవర్ధన్గౌడ్ను ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ప్రత్యేక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా..? అని ప్రశ్నించారు. అనంతరం పీహెచ్సీని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు.
పాము, కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉన్నా యా అని అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీలో ఫార్మసిస్టు లేకపోవడంపై డీఎంహెచ్వో కృష్ణతో మాట్లాడి సాయంత్రంలోగా బాలానగర్లో ఫార్మసిస్టు కోసం ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు. అంతకుముందు తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన సమ్మె వద్దకు వెళ్లి వీఆర్ఏలతో మాట్లాడారు. అలాగే వీఆర్ఏలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కృష్ణారావు, డాక్టర్ రవితేజ, సింగిల్విండో డైరెక్టర్ మంజూనాయక్ తదితరులు ఉన్నారు.