ఎదులాపురం, ఆగస్టు 21 : నిజామాబాద్ జిల్లాకు చెందిన కొత్తకొండ అనసూయ-కృష్ణ దంపతులు వ్యాపారరీత్యా 40 ఏండ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్ద రు కుమారులు కాగా.. చిన్నవాడు సూర్య ప్రకాశ్. పెద్ద కుమారుడు జిల్లాకేంద్రంలోనే హార్డ్‌వేర్ దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి కృష్ణ మూడేండ్ల క్రితం చనిపోగా.. తల్లి అనసూయ చిన్న కుమారుడి వద్దనే ఉంటున్నది.
చిన్న కుమారుడైన సూర్యప్రకాశ్ జైనథ్ మండలం దీపాయిగూడకు చెందిన అక్షయతో పదిహేనేండ్ల క్రితం పెళ్లయింది. వీరు జిల్లా కేంద్రంలోనే హార్డ్‌వేర్ షాప్, పెట్రోల్‌బంక్ నడుపుతూ ఆర్థికంగా వృద్ధి చెందారు. ఇంకా సంపాదించాలన్న తాపత్రయం తో సూర్యప్రకాశ్ అన్ని అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌కు మకాం మార్చి మైహోం అపార్ట్మెంట్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఈ వ్యాపారంలో భాగస్వాములు ఇబ్బందులకు గురి చేయడంతో తీవ్రనష్టాలు వచ్చాయని సమాచారం. ఈ నెల 4న హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చి కుటుంబ సమేతంగా కపిల హోటల్లో ఉంటున్నాడు. శనివారం హోటల్ బాయ్ వచ్చి గది తలుపుతట్టినా ఎవరూ స్పందించక పోవడంతో మేనేజర్‌తోపాటు పోలీసులకు చెప్పాడు. వారు తలుపులు పగులగొ ట్టి చూడగా బెడ్లపై భార్య అక్షయ(36), కూతురు ప్రత్యూ ష(13), కుమారుడు అద్వైత్(10) విగతజీవులుగా పడి ఉన్నారు.
వీరికి విషమిచ్చి.. సూర్యప్రకాశ్(37) ఉరివేసుకుని ఉన్నా డు. కాగా.. రియల్ భాగస్వాములు తనను పెట్టిన బాధల గు రించి లేఖ రాసినట్లు సమాచారం. కాగా.. ఈ విషయం తెలిసి కుటుంబీకులు, బంధువులు నిజామాబాద్ జిల్లాకు తరలివెళ్లారు. జైనథ్ మండలం దీపాయిగూడ, ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని భుక్తాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.