నాగర్‌కర్నూల్, ఆగస్టు 21: ప్రతి దళితుడు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో దళితబంధు పథకం నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రింగ్ మెటీరియల్ దుకాణాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలంలోని మంతటి గ్రామానికి చెందిన వెంకటయ్యకు దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగా అద్దెకు సెంట్రింగ్ మెటీరియల్ సరఫరా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ మేరకు దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్వయం ఉపాధితో దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. దళితబంధును పొందిన ప్రతి లబ్ధిదారులు ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక దళితబంధు పథకం అమలుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా సహకరించాలని కోరారు. దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్న వెంకటయ్య దంపతులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.