మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 21 : మహబూబ్‌నగర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు ఆహ్లాదం అందించాలనే ఉద్దేశంతో పార్కులను ఏర్పాటు చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డు పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన ఫ్రీడమ్ పార్కును మంత్రి ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఒక్క సరైన పార్కు ఉండేది కాదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
పార్కుల సంరక్షణ బాధ్యత ప్రజలకు ఉంటుందని పేర్కొన్నారు. పట్టణంలో అన్ని ప్రాంతాల్లో పార్కులు ఉన్నాయని తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం వాకింగ్, యోగాతోపాటు సేద తీరేందుకు చక్కని అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, అటవీశాఖ జిల్లా అధికారి సత్యనారాయణ, కౌన్సిలర్ రోజా తిరుమల వెంకటేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
జడ్చర్ల టౌన్, ఆగస్టు 21 : కరాటే నేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు శారీరకంగా దృఢత్వం పొందవచ్చని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం జడ్చర్లలోని అల్మాస్ ఫంక్షన్హాల్లో జీకే మాస్టర్ షోటోకాన్ కరాటే డూ ఇండియా ఆధ్వర్యంలో 9వ జాతీయస్థాయి చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు మంత్రి హాజరై మాట్లాడారు.
కరాటేను ఓ క్రీడగా గుర్తించే విషయమై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల మైదానాలు, ఓపెన్ గ్రౌండ్స్‌ల్లో కరాటే శిక్షణనిచ్చేందుకు ముందుకొచ్చే శిక్షకులకు సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంతోపాటు మరిన్ని మైదానాల్లో పెద్ద టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సినీ హీరో సుమన్ మాట్లాడుతూ మార్షల్స్ ఆర్ట్స్ నేర్చుకోవటం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు కరాటే నేర్చుకొంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. అనంతరం పలువురు విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
మాస్టర్ షోటోకాన్ కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్పైరింగ్, కటాస్, ఇతర విభాగాల్లో హోరాహోరీగా పోటీలు జరిగాయి. తిలకించేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు కృష్ణ, తాజొద్దీన్, ఇలియాస్, అశ్వక్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.