వచ్చే వారంలో జాతీయ అధికారుల సందర్శన నాగర్‌కర్నూల్ వైద్యరంగంలో ప్రగతిని సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ హయాంలో పేదల చెంతకు వైద్య సేవలను తీసుకొచ్చారు. వైద్య రంగానికి పెద్దపీట వేయడంతో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి పరుగులు తీస్తున్నది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రభుత్వ దవాఖాన ఆధునీకరణకు నడుం బిగించారు. జిల్లా వైద్యశాలగా అప్‌గ్రేడ్ కావడంతో 320 పడకల స్థాయికి పెరిగింది. గతంలోనే రూ.25 లక్షల సొంత డబ్బులను ఎమ్మెల్యే అభివృద్ధికి ఖర్చు చేసి మరమ్మతులు చేయించారు. 24 గంటలపాటు చికిత్స అందుతున్నది. మెడికల్ కళాశాల మంజూరు మణిహారంగా నిల్వ నుండగా.. రూ.1.25 కోట్లతో డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు, నర్సింగ్ కళాశాల వరంలా మారనున్నాయి. ఇలా జిల్లాలో ఆరోగ్య భాగ్యం సంతరించుకుంటున్నాయి.
నాగర్‌కర్నూల్, మే 29 (నమస్తే తెలంగాణ): కందనూలులో వైద్యరంగం ఎంతో మెరుగైంది. సీఎం కేసీఆర్ హయాంలో చేపట్టిన చర్యలతో పేదలకు వైద్యం దగ్గరకు తీసుకొస్తుంది. ఏరియా దవాఖాన అప్‌గ్రేడ్ కావడంతో స్థాయి 320 పడకలకు పెరిగింది. గతంలోనే ఎమ్మెల్యే రూ.25లక్షల సొంత డబ్బులను దవాఖాన అభివృద్ధికి ఖర్చు చేసి మరమ్మతు పనులు చేయించారు. కలెక్టర్, వైద్యులతో మాట్లాడి 24 గంటలపాటు చికిత్సలు అందించేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకొన్నారు.
ఇక మెడికల్ కళాశాల మంజూరు కావడం మరో వరం. తొలి విడుతలో జిల్లా పేరు లేకుంటే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పందించి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి కళాశాలను మంజూరుకు చొరవ తీసుకున్నారు. ఇలా జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు కాగా ఉయ్యాలవాడలో ఈ అక్టోబర్‌లో తరగతులు ప్రారంభం కానున్నాయి. దీనికిగాను జిల్లా దవాఖానలో పెంచిన పడకలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మెడికల్ కళాశాల మంజూరుతో అన్ని రకాల వైద్యులు, పర్యవేక్షణకు సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులు, నర్సులు విధుల్లో చేరారు.
నర్సింగ్ కళాశాల మంజూరవడం గమనార్హం. ఇలా ఉయ్యాలవాడలో ఆ తర్వాత దవాఖానకు డయాలసిస్ కేంద్రం మంజూరైంది. ఇందులో ప్రతి నెలా 50మంది వరకు కిడ్నీ రోగులు చికిత్స పొందుతున్నారు. అలాగే అత్యవసర సమయాల్లో చికిత్సలకు గాను ఐసీయూ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో కావాల్సిన వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. దీనివల్ల చాలా మంది పేదలకు అత్యవసర, అధునాతన వైద్యం అందుతోంది.
హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు పట్టణ, జిల్లా ప్రజలు పడుతున్న కష్టాలు తీరాయి. వచ్చే వారంలో జాతీయ వైద్య అధికారులు జిల్లా దవాఖాను సందర్శించనున్నారు. దీనికోసం దవాఖానలో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే పట్టణానికి వచ్చిన ప్రతిసారి హాస్పిటల్‌ను సందర్శిస్తూ పనుల పూర్తికి కలెక్టర్, కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా రూ.1.25కోట్లతో డయాగ్నొస్టిక్ సెంటర్ కూడా ఇటీవలే మంజూరైంది. ఇందులో 57రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నారు. ఈ కేంద్రానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఇది వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నది. ఇందులో బీపీ, షుగర్, లివర్, కిడ్నీ, థైరాయిడ్‌లాంటి పలు రకాల అనారోగ్యాలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. పీహెచ్‌సీల్లో శాంపిళ్లు తీసి పంపిస్తే జిల్లాలోని ఆయా దవాఖానలకు 24గంటల్లో ఫలితాలను అందజేస్తారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యాలకు గురై వ్యాధి నిర్ధారణ కోసం పట్టణాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా, కష్టపడకుండా పరీక్షలు అందుతాయి.
ఇలా జిల్లా కేంద్రం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రత్యేక దృష్టితో వైద్యరంగంలో మూడు దశాబ్దాల్లో జరగనంతగా ఏడేండ్లలోనే అభివృద్ధి సాధిస్తోంది. వచ్చే నాలుగైదు నెలల్లో మెడికల్ కళాశాల ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ప్రారంభమైతే నల్లమలలోని అచ్చంపేట, కొల్లాపూర్లాంటి మారుమూల ప్రాంతాల పేదలకు ఆర్థిక కష్టాలు తీరుతాయి. వేలాది మందికి ప్రాణాపాయం తప్పుతుంది.
పేదలు ఆరోగ్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. దీన్ని గుర్తించి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయించాను. ఈ వారంలో జాతీయ వైద్య బృందం జిల్లా దవాఖానను సందర్శించనున్నది. వచ్చే దసరా నాటికి మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభ మవుతాయి. పేద ప్రజలకు హైదరాబాద్‌కు వెళ్లకుండా కార్పొరేట్ స్థాయిలో ఇక్కడే వైద్యం అందుతుంది. ప్రజల ప్రాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ శ్రీరామ రక్షగా నిలుస్తున్నారు.
– మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
