ఉపాధి హామీపై కేంద్రం రోజుకో మెలిక పెడుతున్నది.పేదలకు సొంతూళ్లోనే ఉపాధి కల్పించి వలసలు వెళ్లకూడదనే సదుద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకంపై మోదీ ప్రభుత్వం కత్తులు దూస్తుందనే అనుమానాలకు ఇటీవల నిబంధనలు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఇకపై గ్రామంలో 20 పనులు మాత్రమే చేపట్టాలని, 20 మంది కూలీలు దాటితే రెండు సార్లు కూలీలు సంతకం చేయాలనే నిబంధనలు పనుల అమలుపై నీలి నీడలను పెంచుతోంది. ఈనెల 1వ తేదీ నుంచి అమలవుతున్న ఈ నిబంధనపై కూలీల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
నాగర్‌కర్నూల్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): పేదలు ఆత్మగౌరవంతో సొంతూళ్లోనే జీవించేందుకు 2005లో చట్టంగా రూపొందించగా, 2006లో యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 2008నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పు చేశారు. అలాంటి బృహత్తర పథకం తెలంగాణలో అమలుపై కేంద్రం ఆంక్షలు పథకం అమలుపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతనెల చివర్లో కేంద్రం బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి.
చెరువులు, కందకాలు, తదితర పనులపై ఆరా తీశాయి. గతంలో జరిగిన పనులపై తాజాగా తనిఖీలు చేపట్టడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా తనిఖీలు పూర్తైన వెంటనే ఆగస్టు 1నుంచి పథకం అమలులో కొత్త నిబంధనను ప్రవేశపెట్టడం గమనార్హం.
ఇప్పటి వరకు ఉపాధిహామీలో భాగంగా రహదారుల అభివృద్ధి, కాలువల మరమ్మతులు, చెరువుల్లో పూడిక తీత, ఫీల్డ్ ఛానల్, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతలు, కందకాల తవ్వకాలు, శ్మశాన వాటికల నిర్మాణం, బావులు, సంప్రదాయక నీటి వనరుల పునరుద్ధరణ, కరువు నివారణ చర్యలు, భూముల అభివృద్ధి, అడవుల పెంపకం, వరదల నియంత్రణ, హరితహారంలో భాగంగా గోతులు తీయడం, మొక్కల సంరక్షణ, వన నర్సరీలు, రైతు వేదికలు, వ్యవసాయ కల్లాలు, డంపింగ్ యార్డులు, గొర్రెలు, బర్రెల షెడ్లు, కిచెన్ షెడ్లులాంటి దాదాపుగా 260రకాల పనులను చేపట్టారు.
కూలీలు అడిగిన వెంటనే ఆయా గ్రామాల్లో పని ఉన్నా కల్పించడం జరుగుతున్నది. పేదలకు ఆర్థికంగా ఈ పథకం గొప్ప చేయూతను అందిస్తోంది. అలాంటి ఈ పథకం ద్వారా ఇకపై గ్రామాల్లో కేవలం 20రకాల పనులే చేపట్టాలనే నిబంధన అమలులోకి వచ్చింది. దీనివల్ల కూలీలకు వంద రోజుల పని కల్పన లక్ష్యం నెరవేరడం కష్టంగా మారింది.
ఎక్కువ కూలీలు ఉన్న చోట్ల ఎక్కువ పనులు చేపడుతూ వస్తున్నారు. ఈ నిబంధన కూలీలకు అశనిపాతంలా మారనున్నది. కొత్తగా పనులు కల్పించాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఓ పంచాయతీ నుంచి కలెక్టర్ వరకు అనుమతి తీసుకోవాలనే ప్రక్రియలో జాప్యం జరిగి కూలీలకు పనులు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి. అదే విధంగా కూలీల సంతకం రెండు సార్లు అప్లోడ్ చేయాలనే నిబంధన సైతం అమలులోకి వచ్చింది.
అలాగే పని చేసే కూలీల ఫొటోలు రెండుసార్లు అప్లోడ్ చేయాలి. ఉదయం 9గంటలకు, సాయంత్రం 5గంటలకు ఒకసారి రిజిస్టర్లో ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ ఆప్‌లో చేయాలి. ఇలా చేస్తేనే కూలీలకు రూ.257గిట్టుబాటు ధర దక్కుతుంది. ఇప్పటికే ఉపాధి హామీలో ఎండాకాలంలో కూలీలకు టెంట్లు, తాగునీటి కల్పన నుంచి కేంద్రం తప్పుకొన్నది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నిబంధనలు పనుల కల్పనలో కూలీలకు కష్టకాలం తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు గ్రామాల్లో పలురకాల పనులు కల్పించడం జరిగింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఇకపై గ్రామంలో 20రకాల పనులు పూర్తయ్యాకే కొత్త పనులు కలెక్టర్ ఆమోదంతో చేపట్టాల్సి ఉంటుంది. అలాగే కూలీల సంతకాలను రోజూ రెండు సార్లు కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. ఇలా చేస్తేనే కూలీలకు రూ.257 గిట్టుబాటు కూలీ అమలవుతుంది. ఆగస్టు 1నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో ఇప్పటి వరకు 2.06లక్షల మంది కుటుంబాలకు జాబ్‌కార్డులు 2,00,840 మంది ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటున్నారు. బ్యాంకు ఖాతాలు సమస్య ఉన్న కూలీలకు కొత్తగా పోస్టాఫీస్, ఇతర బ్యాంకుల ఖాతాలు కూడా తీయించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– నర్సింగరావు, డీఆర్డీవో, నాగర్‌కర్నూల్
