తీజ్ ఉత్సవాలు గిరిజనులకు పెద్ద పండుగ వంటిదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జేపీనగర్‌లో 4వ వార్డు కౌన్సిలర్ హుమ్లీ హన్మానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి గువ్వల అమలతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కల్వకుర్తి రూరల్, ఆగస్టు 21 : గిరిజన బిడ్డల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా తీజ్ ఉత్సవాలను నిర్వహిస్తారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. తీజ్ ఉత్సవం గిరిజనులకు అతి పెద్ద పండుగ అన్నారు. ఆదివారం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జేపీనగర్‌లో 4వ వార్డు కౌన్సిలర్ హుమ్లీ హన్మానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి గువ్వల అమలతో కలిసి మంత్రి హాజరయ్యారు.
అంతకుముందు మంత్రిని గిరిజనులు ఘనంగా స్వాగతించగా.. దేవాలయం వద్ద పూజలు నిర్వహించి యువతులకు తీజ్ బుట్టలను అందించారు. మంత్రి గిరిజన దుస్తులను అలంకరించుకొని తండా మహిళలతో నృత్యాలను చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు తండాలను జీపీలుగా మార్చారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారని చెప్పారు. ఉద్యమ నేత మన సీఎంగా ఉండడం అందరి అదృష్టమన్నారు.
గతంలో ఏ పాలకులు గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్‌ను గుర్తించలేదన్నారు. నేడు అధికారికంగా ఆయన జయంతిని నిర్వహిస్తున్నదని తెలిపారు. నూతన జీపీల్లో రూ.25 లక్షలతో పంచాయతీ భవనాలను నిర్మించనున్నట్లు, ఇందుకోసం నిధులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. గిరిజనులు ఐక్యంగా ఉంటూ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంది గిరిజనుల మధ్య తీజ్ పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం మాట్లాడుతూ గిరిజనులు ఘనంగా జరుపుకొనే తీజ్ చాలా విశిష్టమైందన్నారు.
గత పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు. నేడు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే జైపాల్ మాట్లాడుతూ పల్లె ప్రగతితో తండాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. గిరిజనుల విద్యాభివృద్ధికి గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. గురుకులాల్లో గిరిజనులకు సీట్లు పెంచేలా చూస్తామన్నారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్, నాయకులు హన్మానాయక్, షానవాజ్‌ఖాన్, బాలునాయక్, నిరంజన్, నాయకులు పాల్గొన్నారు.