వనపర్తి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఒక్కరోజు చేసేవి కావని.. నిత్యం నిర్వహించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎకో పార్కు వరకు నిర్వహించిన ఫ్రీడమ్ రన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట విషయాలు, గొప్పతనం నేటి తరాలకు తెలియాల్సిన అవసరం ఉన్నదన్నారు.
దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడేందుకు 225 ఏండ్ల కిందట నుంచి స్వాతంత్య్ర భావనలతో మన పూర్వీకులు, మహనీయులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివన్నారు. 150 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో 75 ఏండ్ల కిందట స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. నాడు పోరాటాలు చేసిన త్యాగధనుల సేవలు భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వజ్రోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ మొక్కుబడిగా కాకుం డా 15 రోజులపాటు నిత్యం భిన్నమైన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారని చెప్పారు. 8 నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు వివరించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వా తంత్య్రం కోసం ఆజాద్ హిందూ ఫౌజ్‌ను రూపకల్పన చేశారన్నారు. దేశంలో ఒక్కోచోట ఒక్కో విధంగా దేశంలోని ప్రజలను స్వాతంత్య్ర సంగ్రామం వైపు కదిలించారని గుర్తు చేశారు. ఎవరు ఏదారి ఎంచుకున్నా అందరి లక్ష్యం స్వాతంత్య్రం కోసమే జరిగిందన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి పాత్రలేని వారు, బ్రిటీష్ పాలకులకు తొత్తుగా వ్యవహరించిన వారు నేడు ఈ దేశానికి ప్రభువులుగా ఉన్నారని విమర్శించారు.
అంబేద్కర్ రాసిన రా జ్యాంగం ప్రకారమే దేశంలో పాలన, న్యాయ, శాసన వ్యవస్థలతోపాటు ఇతర వ్యవస్థలు నడుస్తున్నాయని తెలిపారు. రాజ్యంగానికి విఘాతం కలుగకుండా ముందుకు అడుగులు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.