బాలానగర్/జడ్చర్ల టౌన్/వనపర్తి టౌన్/గద్వాల/నాగర్కర్నూల్, ఆగస్టు 11 : తన అన్న య్య, తమ్ముడి జీవితం ఆనందమయం కావాలని చెల్లి, అక్క నిండు మనస్సుతో కోరుకుం టూ పరస్పరం ఆనందంగా చేసుకునే తీయని వేడుక రాఖీ పండుగ. తన సోదరుడు కలకాలం సుఖసంతోషాలతో జీవించాలని కోటి దేవుళ్లను వేడుకొని.. ఆ దీవెనలన్నింటినీ ఓ దారంలో పోగేసి అన్న చేతికి కట్టి మురిసిపోతుంది.
ఎంత దూరంలో ఉన్నా.. బిజీగా ఉన్నా ఏటా సోదరీమణులు అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి వారి అనుబంధాన్ని చాటుకుంటారు. రాఖీ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా-చెల్లెలు, అక్కా-తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకొనే పండుగ. శుక్రవారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.
ఈ ఏడాది రాఖీ లు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. పూజా సామగ్రితో కూడిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్కో రాఖీ ధర రూ.5 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. బంగారం, వెండి రాఖీలకు గిరాకీ ఉన్నది. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో రక్షాబంధన్ విక్రయాలు జోరందుకుంటున్నాయి. మార్కెట్లు రాఖీల కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.