నాగర్‌కర్నూల్, ఆగస్టు 5: శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వరలక్ష్మీవ్రతాలను శాస్రోక్తంగా నిర్వహించారు. పట్టణంలోని సాయిబాబా ఆలయం, రామాలయం, సుబ్రమణ్యస్వామి ఆలయం, సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో మహిళలు వ్రతాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ రెండో శుక్రవారం కావడంతో అన్ని ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యే క పూజలు నిర్వహించారు.
సామూహిక వ్రతాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి కన్వీనర్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వ్రతాల్లో వ్రత కథ విధానాన్ని ప్రధాన అర్చకులు వావిలాల రాజశేఖర్‌శర్మ వివరించారు. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నప్రసాద పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో సాయిప్రశాంతి చారిటబుల్ ట్రస్టు కన్వీనర్ ఈశ్వరయ్య, వివిధ సాయి కన్వీనర్లు సత్యనారాయణ, విజయభాస్కర్, శారద, సత్యసాయి భక్తులు, సరస్వతీ శిశు మందిర్ ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.
కల్వకుర్తి, ఆగస్టు 5 : కల్వకుర్తి పట్టణంలోని వాసవీమాత కన్యకాపరమేశ్వరి ఆలయంలో భక్తులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో సామూహికంగా వరలక్ష్మీవ్రతాలను నిర్వహించారు. పూజలో భాగంగా వాసవీమాతకు ప్రాతఃకాల పూజలు ఆచరించారు. కార్యక్రమంలో భాగంగా వాసవీక్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆల య ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేశ్‌బాబు, వాసవీక్లబ్, వనితాక్లబ్ సభ్యులతోపాటు, వాసవీక్లబ్ బృందం పాల్గొన్నారు.
కల్వకుర్తి రూరల్, ఆగస్టు 5 : మండలంలోని ఆయా గ్రామాలు, కల్వకుర్తి పట్టణంలోని షిరిడీసాయి, సత్యసాయి ప్రశాంతి సన్నిధిలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులు వరలక్ష్మీవ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు.
బిజినేపల్లి, ఆగస్టు 5: మండలంలోని పాలెం, వట్టెం, మంగనూర్ గ్రామాల్లో శుక్రవారం వరలక్ష్మీవ్రతాలను నిర్వహించారు. పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దఎత్తున మహిళలు సామూహికంగా వ్రతాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. అదేవిధంగా మంగనూరు చౌడేశ్వరి ఆలయంలో మహిళలు సామూహిక వ్రతాలు చేశారు.
తెలకపల్లి,ఆగస్టు 5: మండలంలోని పెద్దూరు గ్రామంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సత్యసాయి మహిళా భక్తుల ఆధ్వర్యంలో మహిళలు సామూహిక వరలక్ష్మీవ్రతాలను చేశారు. 40మంది మహిళలు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో వ్రతాలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు ప్రమీలమ్మ, విజయమ్మ, కవిత, శిరీష, ఇందిరమ్మ ఉన్నారు.
తిమ్మాజిపేట,ఆగస్టు 5 : మండలకేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.