బాలానగర్, మే 29: ఓవర్ లోడ్‌తో భారీ వాహనాలు రోడ్లపై తిరుగుతుండడంతో ప్రజలకు, ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని హడలిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాంటి వాహనాలను అదుపు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. లారీలు, టిప్పర్లలో డస్టు, కంకర, ఇసుక, మట్టి వంటి వాటిని నిబంధనలకు విరుద్ధంగా లారీ బాడీకి పైగా నింపుకొని తరలిస్తుండటంతో ప్రమాదకరంగా మారింది. కంకర వంటి రాళ్లు వెనక వచ్చే వాహనాలపై పడుతుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికలోడు కారణంగా మరో పక్క తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా సంబంధిత ఆర్టీఏ అధికారులు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మండలంలోని గౌతాపూర్, అప్పాజిపల్లి, బోడజానంపేట, బోడగుట్టతండా సమీపంలోని క్వారీ, మైనింగ్‌ల నుంచి కంకర, డస్టు మొరం వంటివి ఇతర ప్రాంతాలకు లారీలు, టిప్పర్ల ద్వారా నిత్యం తరలిస్తున్నారు. వాస్తవంగా నింపాల్సిన బరువు కంటే అదనంగా తరలిస్తున్నారు. 25 టన్నుల సామర్థ్యం ఉన్న లారీలో 30 నుంచి 40 టన్నుల మేర నింపి తరలిస్తున్నారు. దీంతో రోడ్లు పాడవుతున్నాయి. గతంలో ఈ రోడ్డు మార్గంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పడి నుంచి కింద పడి మృత్యువాత పడ్డ సంఘటనలూ ఉన్నాయి. ఈ రోడ్డు మార్గంలో ద్విచక్ర వాహనదారులు వెళ్లాలంటే భయందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వాపోతున్నారు.
అధిక వేగంతో వెళ్లే వాహనాలకు గుర్తించి ఫైన్లు వేస్తాం. యజమానులకు చెప్పి, రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకుంటాం. అధిక లోడ్ విషయమై ఆర్టీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని సూచిస్తాం. అధిక లోడ్ సామర్థ్యానికి పర్మిషన్ లేదు. సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటాం.
– జయప్రసాద్, ఎస్సై బాలానగర్
మండలంలోని క్రషర్ పరిశ్రమల నుంచి లారీలు పరిమితికి మించి లోడింగ్ తీసుకవెళ్తున్నాయి. స్పీడ్ బ్రేకర్స్, మలుపుల వద్ద బీటీ రోడ్డు కిందకు దిగినప్పుడు, సడన్ బ్రేకులు వేసినప్పుడు కంకర రోడ్డుపై పడుతుంది. వాహనదారులు ఈ కంకరపై వెళ్తుండటంతో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయి. పరిమితికి మించి లోడింగ్ చేయరాదనే నిబంధనలను క్రషర్ పరిశ్రమ నిర్వాహకులు, లారీల యాజమాన్యం పట్టించుకోవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.