కొల్లాపూర్, ఆగస్టు 5: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఏర్పాటు చేసిన గురుకులాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. పట్టణ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో శుక్రవారం జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే బీరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని, అ దిశగా సీఎం కేసీఆర్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు, కళాశాలలు ప్రారంభించి నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించాలన్నదే సీఎం లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రెసిడెన్షియల్ గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పెరిగిందని, ప్రవేశ పరీక్షల మెరిట్ ఆధారంగానే చేరికలు ఉంటాయన్నారు. విదేశీ చదువుల కోసం నియోజకవర్గం నుంచి ముగ్గురు విద్యార్థులకు రుణసౌకర్యం కోసం సిఫార్సు చేయగా వారు ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నట్లు ఎమ్మెల్యే బీరం వివరించారు.
గురుకుల పాఠశాల, కళాశాల భవనం కోసం తన ఏసీడీపీ నుంచి రూ.25లక్షలతోపాటు ప్రభుత్వం ద్వారా మరో రూ.35లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. గురుకులాల్లో క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడానికి టీచర్‌ను ఏర్పాటు చేయాలని, కావాల్సిన డబ్బులను ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదేవిధంగా సమావేశంలో విద్యార్థినులకు ఎమ్మెల్యే బీరం పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్‌నాయక్, మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జాఫర్, ఎంపీపీ భోజ్యానాయక్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నిరంజన్, దళితబంధు తాలూకా కోఆర్డినేటర్ కాటం జంబులయ్య, కౌన్సిలర్లు కృష్ణమూర్తి, పస్పుల కృష్ణ మాట్లాడారు.
కార్యక్రమంలో కోడేరు సింగిల్‌విండో చైర్మన్ చిన్నారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘువర్ధన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రామచందర్‌యాదవ్, ఖాదర్‌పాషా, పట్టణ అధ్యక్షుడు పరశురాంగౌడ్, నాయకులు కేశవులు, శ్రీను, కాడంశ్రీను, మహేశ్, మురళీధర్‌రెడ్డి, పలక రాముడు, దేవేందర్‌నాయుడు, అర్జున్, గోపాలమల్లయ్య, కుమ్మరిశేఖర్, బడా గోపాల్, రీజినల్ కోఆర్డినేటర్ వనజ, ప్రిన్సిపాల్ జ్యోత్స్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.