మూసాపేట, ఆగస్టు 4: ఓ వార్డు మెంబర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన సంఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట మండలంలోని వేముల గ్రామంలో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కోడి సాయమ్మను ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు.
ఆ పంచాయతీకి చెందిన ఏడుగురు వార్డు సభ్యుల సంతకాలతో జూలై 26న మహబూబ్నగర్ ఆర్డీవోకు వేముల ఉపసర్పంచ్ కోడి సాయమ్మను ఎన్నికను రద్దు చేసి, తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అందుకు ఈ నెల 2న ఆర్డీవో కార్యాలయం నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవికి నోటీసులు వచ్చాయి. బుధవారం సంబంధిత వార్డు సభ్యులందరికీ నోటీసులు అందాయి. అందులో 1వ వార్డు సభ్యురాలు మల్లమ్మ తీర్మాణంపై సంతకం చేయలేదు.
అయితే సంతకాన్ని ఆమె ఫోర్జరీ చేసినట్లు చెప్పి, సంతకం తానే చేసినట్లు ఒప్పుకోవాలని మల్లమ్మపై ఒత్తిడిచేశారు. వేముల గ్రామానికి చెందిన వార్డు సభ్యులు అచ్యుతారెడ్డి, టీకే నర్సింహులు, మరో వార్డు సభ్యురాలి భర్త చెన్నయ్య తనను బెదిరింపులకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు గురువారం మూసాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.