మరోమారు భారీ వర్షానికి ఉమ్మడి పాలమూరు తడిసిముద్దయింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జామువరకు కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేటలో మోస్తరుకు మించి వర్షాలు పడ్డాయి. కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం పెరిగింది. మాగనూరు పెద్దవాగు ఉప్పొంగింది.
సంగంబండ నిండుకుండను తలపించడంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని చేశారు. ఊట్కూర్ మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చిట్టె పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల కుంటలు అలుగుపారుతున్నాయి. మహబూబ్నగర్ సమీపంలోని బండలవాగుకు పరవళ్లు తొక్కుతున్నది. ఊట్కూర్ మండలంలోని పెద్దవాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నది.
మహబూబ్నగర్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. మిగతా జిల్లాల్లో ముసురు పడింది. కృష్ణ, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. వాగులు జలకళను సంతరించుకున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండలవాగుకు జలపాతాన్ని తలపిస్తున్నది. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి కాజ్వేపై ప్రవహిస్తున్నది. దీంతో అమీన్పూర్, పగిడిమర్రి, సామనూరు, ఓబులాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఉప్పొంగుతున్న వాగును దాటి ఆయా గ్రామాల ప్రజలను కలిశారు.
వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఎవరూ వాగు దాటొద్దని సూచించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారు. మాగనూరు పెద్దవాగు, ఊకచెట్టు వాగు, దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కుంటలు, చెరువులు అలుగులు పారుతున్నాయి.