భూత్పూర్, ఆగస్టు 1 : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెనలో నిర్మితమవుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మధ్యాహ్నం జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామానికి గంజి పెంటయ్య(60) తన చేపల వలను తీసుకొని భార్య నర్సమ్మకు చెప్పి బయలుదేరాడు.
మార్గమధ్యంలో అదే గ్రామ పరిధిలోని కొత్తతండాకు చెందిన జరుపుల దేవుజ్య(45)తో కలిసి కరివెన ప్రాజెక్టుకు చేరుకున్నారు. రాత్రి వరకు పెంటయ్య ఇంటికి రాకపోయే సరికి గ్రామంలో వెతికారు. సోమవారం ప్రాజెక్టు వద్దకు వచ్చి చూస్తే నీటి గుంతలో రెండు శవాలు తేలి ఉండడం చూసి బోరున విలపించారు. గంజి పెంటయ్య భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. దేవుజ్యకు భార్య, కుమారుడు ఉన్నారు.
జడ్చర్లటౌన్, ఆగస్టు 1 : చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందడంతో మండలంలోని ఆలూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచన మేరకు.. జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ మురళి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, ముడా డైరెక్టర్ ఇంతియాజ్ జిల్లా దవాఖానకు వెళ్లి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.