నాగర్కర్నూల్, జూలై 28: జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న తొటిమెట్టు జిల్లాస్థా యి శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియో గం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి అన్నారు. జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రిసోర్స్ పర్సన్లకు తొలిమెట్టుపై నిర్వహిస్తున్న చివరిరోజు శిక్షణను డీఈవో గోవిందరాజులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జాతీయ సాధన సర్వే 2021లో జిల్లా సంతృప్తికర ఫలితాలు సాధించలేదన్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు.
దీంతో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తయ్యే సరికి ప్రతి విద్యార్థి ఆశించిన అభ్యాసన ఫలితాలను సాధించేలా ప్రణాళికలను రూపొందిం చుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా బోధన చేపట్టేలా ఉపాధ్యాయులను చైతన్యవంతులను చేసేలా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు మంచి నైపుణ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఐదురోజులు బోధనాభ్యాసన ప్రక్రియలు నిర్వహించి 6వ రోజు పిల్లల స్థాయిని నిర్ధారించడానికి మూల్యాంకనం చేయాలని ఆదేశించారు.
రీసోర్స్ పర్సన్లు బాగా నేర్చుకొని మండలాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ఆసక్తిని తెలుసుకొని వారు రాణించే రంగా ల్లో వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించి విద్యార్థులు అనర్గళంగా అన్ని సబ్జెక్టుల్లో మాట్లాడి చదివే విధంగా తీర్చిదిద్దాలన్నారు. తొలిమెట్టు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి సతీశ్, జిల్లాస్థాయి శిక్షణ రిసోర్స్ పర్సన్లు సాయిరెడ్డి, లక్ష్మీనర్సింహారావు, పాండు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
నాగర్కర్నూల్, జూలై 28: రక్తదానం ఒక సామాజిక బాధ్యతని, ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి పిలుపునిచ్చారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో తగినస్థాయిలో రక్త నిల్వలు ఉండేలా గురువారం కలెక్టరేట్ సముదాయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని అదనపు కలెక్టర్ మనూచౌదరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ దవాఖానలోని బ్లడ్ బ్యాంక్ సామర్థ్యం, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతినెలా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పనిచేస్తున్న ఉద్యోగులు స్వ చ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడానికి 100 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా వారు జిల్లా దవాఖానలో రక్తదానం చేయడానికి ముందుకొచ్చారన్నారు. రక్తదానం చేస్తే ఆ రోగ్య సమస్యలు వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు.
రక్తదానం చేసేలా ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తొలుత ప్రభుత్వ ఉద్యోగులు ఈ శిబిరంలో స్వచ్ఛంద రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి అవసరమైన రక్తం అందుబాటులో ఉండేలా స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ప్రకాశ్, కలెక్టరేట్లోని డీఆర్డీఏ, రెవెన్యూ, డీపీఆర్వో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.