కొల్లాపూర్ రూరల్, జూలై 28 : కొల్లాపూర్ మండలంలో ఎంజీకేఎల్ఐ నుంచి ఎత్తిపోస్తున్న జలాలు కాలువల్లో పుష్కలంగా పారుతున్నాయి. ఎత్తిపోసిన నీరు జలాశయాల్లో నిండగా, ప్రధాన కాలువల వెంట పరుగులెత్తుతున్నది. పాటు కాలువల ద్వారా ఉరకలేస్తూ పంట కాలువలకు చేరాయి. దీంతో రైతులు సంబురంగా సాగు పనులు చేసుకుంటున్నారు.
పొలాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. నాగళ్లు, ట్రాక్టర్లతో కరిగెట్లు చేస్తున్నారు. ఎత్తిపోతల నీరుకు రైతుబంధు కూడా తోడు కావడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. రెట్టింపు ఉత్సాహంతో మాగాణి పొలాల్లో హలంతో కదం తొక్కుతున్నారు. అలాగే ఇటీవల కురుస్తున్న వర్షాలకు మెట్ట రైతులు తమ పొలాలను చదును చేసుకొని జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ, ఆముదం విత్తనాలు విత్తుకున్నారు.
మండలంలో 3 హెక్టార్లలో జొన్నలు, 900 ఎకరాల్లో మొక్కజొన్న, 140 ఎకరాల్లో కందులు, 85 ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో వేరుశనగ, 28 ఎకరాల్లో ఆముదం సాగుచేస్తున్నారు. అలాగే బావులు, చెరువులు, కుంటల కింద 5,500 ఎకరాల్లో వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు రైతులు శ్రావణంలో నారుమడులు వేసుకోనున్నారు. అలాగే ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉరకలేస్తున్నది.