కేంద్రానిది ప్రచారం బారెడు..సాయం మూరెడు అని మరోమారు రుజువైంది. ‘రైతుబంధు’ పథకాన్ని కాపీకొట్టి ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ప్రవేశపెట్టి రైతుకు ఆర్థికసాయం ఇవ్వాలని భావించినా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు.. నిబంధనల పేరుతో ప్రతి ఏడాది లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సందర్భంగా మూడు విడుతలుగా రూ.2వేల సాయం అందించిన కేంద్రం తర్వాత ఏడాది నుంచి నిబంధనల సాకుతో సాయం నిలిపివేస్తూ వస్తున్నది. 2018 డిసెంబర్ నాటికి జోగుళాంబ గద్వాల జిల్లాలో 96,591 మంది లబ్ధిదారులుండగా 2022 జూలై నాటికి ఆ సంఖ్య 54,782కు తగ్గింది.
జోగుళాంబ గద్వాల జిల్లా వివరాలు
ఏడాది లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో)
2018 1,33,654 163
2022 1,54,894 224
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం
ఏడాది లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో)
2018 96,591 57. 96
2022 54,782 32.86
గద్వాల, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే, నిబంధనల పేరుతో రైతుల సంఖ్యను తగ్గిస్తూ మొండిచేయి చూపిస్తున్నది. 2018-19 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అర్హత ఉన్న రైతులందరికీ ఏడాదిలో మూడు విడుతలుగా రూ.2వేల చొప్పున రూ.6 వేలు ఖాతా ల్లో జమచేసింది. ఎన్నికల తర్వాత సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది.
రైతులు తమ ఖాతాలో నగదు జామ కాకపోవడంతో వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రైతులు ‘ప్రచారం బారెడు.. సాయం మూరెడు’ అని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు కక్కుతున్నారు. ప్రతి విడుతకు రైతుల సంఖ్య తగ్గిస్తున్నా.. రాష్ట్ర బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం సెంట్ భూమి ఉన్న రైతుల నుంచి పెట్టుబడి సాయం అందజేస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటే.. ఓర్వలేని ప్రతిపక్షాలు రైతుబంధు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొంటున్న కేంద్రం.. జిల్లాలో ప్రస్తుతం ఎంతమంది రైతులకు ఇస్తుందో మాత్రం చెప్పడం లేదు. పీఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టినప్పుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు ఖాతాలో విడుతకు రూ.2వేలు జమ చేస్తూ వచ్చింది. తర్వాత నిబంధనల పేరుతో ఆ పథకాన్ని రైతులకు దూరం చేస్తూ వస్తున్నది. ఎవరైనా కొత్త వారు దరఖాస్తు చేసుకుందామని ఆన్లైన్ సెంటర్లకు వెళ్తే వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో చాలా మంది రైతులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతుబంధు కింద 2018లో 1,33,654 మంది రైతులకు రూ.163 కో ట్లు, 2022లో 1,54,894 మంది రైతులకు రూ. 224 కోట్లు పంపిణీ చేశారు. కాగా, 2018లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 96,591 మంది రైతులకు రూ.57.96 కోట్లు, 2022లో 54,782 మంది రైతులకు రూ.32.86 కోట్లు పంపిణీ చేశారు. నాలుగేండ్ల వ్యవధిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల సంఖ్య తగ్గడంతోపాటు పంపిణీ చేసిన డబ్బు కూడా తగ్గించారు. అదే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద రైతుల సంఖ్య పెరిగినా వెనక్కి తగ్గకుండా పెట్టుబడి అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నది.
1 డిసెంబర్ 2018 నుంచి 31 మార్చి 2019 వరకు మొదటి విడుత కింద జోగుళాంబ గద్వాల జిల్లాలో 96,591 మందికి సాయం అందింది. 1 ఏప్రిల్ 2019 నుంచి 31 జూలై 2019లో 95,962 మంది ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఇలా మొదటి, రెండో విడుతకు వివిధ కారణాలతో దాదాపు వెయ్యి మందిని తగ్గించింది. 1 ఆగస్టు 2019 నుంచి 30 నవంబర్ 2019లో మూడో విడుత కింద 93,707 మంది రైతులకు మాత్రమే సాయం అందింది. రెండు, మూడు విడతకు 1,884 మంది రైతులు తగ్గారు.
నాలుగో విడుతలో 91,887, ఐదో విడుతలో 91,345, ఆరో విడుతలో 89,958, ఏడో విడుతలో 88,436, ఎనిమిదో విడుతలో 86,427, తొమ్మిదో విడుతలో 85,027, పదో విడుతలో 82,683, 11వ విడుతలో 54,872 మంది రైతులకు సాయం అందింది. ఇలా ప్రతి విడుతకు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. మొదటి విడుతకు, 11వ విడుతకు దాదాపుగా 42 వేల మందిని తగ్గించింది.
మిగతా రైతులను వివిధ కారణాలతో అనర్హుల జాబితాలో చేర్చింది. దీన్ని బట్టి చూస్తే కేంద్రం కేవలం ఎన్నికల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని రైతులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తుంటే.. కేంద్రం రైతుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నది.