శ్రీశైలం, జూలై 28 : శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాసోత్సవాల ప్రారంభానికి వ చ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. గురువారం ఆయన ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శుక్రవారం నుంచి ఆగస్టు 28 వరకు జరిగే ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నట్లు చెప్పారు. అందులో భాగంగా అ ఖండ శివనామ భజనలు, నిత్యం మూడు విడుతల్లో సామూహిక అభిషేకాలు ఉంటాయన్నారు. ప్రధానంగా రద్దీ రోజుల్లో గర్భాలయ అభిషేకాలు నిలిపివేయనున్నట్లు చెప్పారు.
భక్తులకు అందుబాటులో ఉండేలా లడ్డూ ప్రసాదాలు, అన్నదాన విభాగంలో ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. స్వామి, అమ్మ వారి దర్శనాల్లో మార్పులు చేస్తూ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఉభయ ఆలయాల్లో మహా మంగళహారతుల అనంతరం భక్తులను సర్వదర్శనాలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. శ్రావణ సోమవారాలు, శుక్రవారాల్లో అలంకార దర్శనాలు మాత్రమే ఉంటాయన్నారు. రెండు, నాలుగో శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతాలను ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆలయ ప్రధాన విభాగ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.