పెబ్బేరు, జూలై 24 : మున్సిపాలిటీలో ఉద్యోగుల జీతాలు, పట్టణంలో ప్రగతి పనుల నిర్వహణకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నులే. ఇలాంటి పన్ను వసూళ్లలో పురపాలక సంఘం అలసత్వం ప్రదర్శిస్తున్నది. పన్ను వసూళ్లలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నది.
మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారుల నిర్లక్ష్యం వలన పన్నుల వసూళ్లు ముందుకు సాగడంలేదు. పన్నుల వసూళ్లలో మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో ఆస్తిపన్ను బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. పేరుకుపోయిన బకాయిలు, మొండిబకాయిల వసూళ్లు మున్సిపాలిటీకి గుదిబండగా మారింది. ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తూ లక్ష్యాలు నిర్ధేశిస్తున్నా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అలసత్వం వీడడం లేదు. దీంతో అనుకున్న లక్ష్యాలు సాధించడంలో పెబ్బేరు పురపాలక సంఘం పూర్తిగా వెనుకబడి పోయింది.
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వన్ టైం స్కీం ద్వారా 90శాతం వడ్డీ మాఫీతో ఆస్తి పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించింది. దీంతో పన్నులను చెల్లించేందుకు ప్రజలు పురపాలక కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పన్నులు చెల్లించేందుకు వచ్చే ప్రజలకు సరైనా ధ్రువీకరణపత్రాలు లేవని, ఆన్లైన్ సహకరించడం లేదనే సాకులు చెప్పడంతో ప్రజలు కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు.
పన్నులు చెల్లించేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. నిరక్ష్యరాసులైన కొందరు పన్నుదారులు పన్నులు చెల్లించేందుకు వెళ్లిన వారికి సరైన అవగాహన కల్పించకుండా అధికారులు నిర్ల క్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంఘం ఆస్తి పన్ను, పాత బకాయిలు కలిపి పురపాలక సంఘం రూ.57.56లక్షల బకాయిలకుగానూ ఈ నెల 16వరకు వసూళ్లు చేసింది రూ11.53లక్షలు. ఇంకా వసూ ళ్లు చేయాల్సిన బకాయి రూ.46.03 లక్షలు. మొత్తం 20 శాతం పన్నులు మాత్రమే వసూళ్లు చేశారు.