కల్వకుర్తి రూరల్, జూలై 3 : సర్కారు బడులంటేనే అరకొర వసతులుంటాయనే భావన చాలా మందిలో ఉంటుంది .. గ్రామాల్లో బడి ఉంటే పం తుల కొరత.. పంతుళ్లు ఉంటే వసతులు కరువు.. కొన్ని చోట్ల అన్ని ఉన్నా చదువుకునేందుకు విద్యార్థులు కరువు అన్నట్లుగా ఉంటుంది. కానీ మండలంలోని బెక్కర గ్రామంలో మాత్రం ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పాఠశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే కార్పొరేట్ పాఠశాలలోకి అడుగు పెట్టామా.. అన్న భావన కలుగుతుంది.
పాఠశాల ప్రవేశ ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే వసతులు, పాఠశాల ప్రహరీ, తరగతి గదుల్లో గీసిన చక్కటి చిత్రాలను చూసిన ప్రతిఒక్కరూ పాఠశాల వసతుల్లో అత్యుత్తమం.. బోధనలో వినూత్నమని కితాబు ఇవ్వక మానరు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని సర్కారు బడులను బలోపేతం చేసి పేద విద్యార్థులకు మెరుగైన ఆంగ్ల విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టిం ది. ఈ క్రమంలో భాగంగా హెచ్ఎం రఘురామారావు గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో చిన్నారులను ఆకట్టుకునేందుకు ఎలాంటి వసతులు కల్పిస్తారో అంతకుమించి వసతులు ప్రజలు, చిన్నారుల తల్లిదండ్రులు, దాతల సహకారంతో కల్పి స్తూ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా తమ పాఠశాలలోనే చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. చిన్నారులకు క్రీడాపరికరాలు, ప్రొజెక్టర్‌తో డిజిటల్ బోధన, విద్యార్థులు అతి సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకుని పాఠశాల అంటే భయం అనే భావనను దూరం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు, బెక్కర పాఠశాల ఉపాధ్యాయులు, హెచ్ఎం కృషి చూసిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాఠశాల అభివృద్ధిలో మేము సైతం అంటూ భాగస్వామ్యమై రూ. ఎనిమిది లక్షలతో పాఠశాలకు కావాల్సిన వసతులను సమకూర్చి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారు. ఈ విద్యాలయాన్ని సందర్శించిన ప్రతిఒక్కరూ సరస్వతీమాత ఒడిగా అభివర్ణిస్తున్నారు.
బెక్కర ప్రాథమిక పాఠశాల వసతుల్లో ప్రత్యేకంగా నిలువడంతోపాటుగా బోధనలో సైతం వినూత్నంగా నిలుస్తోంది. పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధనా పరికరాలను తయారు చేసి వారికి అర్థమయ్యే రీతిలో బోధించడం ఇక్కడి పాఠశాల ప్రత్యేకత. విద్యార్థులు వర్ణమాల, గుణింతాలు, గణితంలో కూడికలు, తీసివేతలు, బోధన పరికరాలను (డ్రాయింగ్షీట్స్, నిరుపయోగంగా వాటర్ బాటిల్స్, గోళీలు, ఇతర్రాలు) ఉపయోగించి తయారుచేసిన వాటితో బోధించడంతో విద్యార్థులు సునాయాసంగా అర్థం చేసుకోవడంతో పాటు వాటిని వేగంగా చదవగలుగుతున్నారు.
ఆంగ్లానికి సంబంధించిన పదాలు సులభంగా పలకడంతోపాటుగా వాటిని చదువుతూ అంతే వేగంగా రాస్తున్నారు. హెచ్ఎం రఘురామారావు బోధనా పరికరాలను తానే స్వయంగా తయారు చేసి విద్యార్థులతో సులభంగా చదివిస్తుండడంతో వారికి పాఠశాల అంటే భయం పోయింది. పాఠశాలలో దాతల సహకారంతో సరస్వతీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయించడంతోపాటుగా ప్రతి ఏడాది విద్యార్థులకు ఉచితంగా అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు అంటేనే నిర్వహణ సరిగా ఉండదనే భావన చాలా మందిలో ఉం టుంది. కానీ బెక్కర పాఠశాలను తరగతి గదులు, ప్రహరీలు, క్రీడా ప్రాంగణం చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. పాఠశాల ఆవరణ పచ్చటి చెట్లతో ఉండడంతో పాటుగా గోడలపై చక్కటి బొమ్మలను వేయించడంతో పాఠశాలకు కొత్త వన్నె చేకూరింది. సర్పంచ్ ,దాతల సహకారంతో పాఠశాలలోని తరగతి గదులకు చక్కటి రంగులు వేయించడంతోపాటు పాఠశాల లోపల, వెలుపలి భాగం గోడలకు అద్భుతమైన పేయింటింగ్స్ వేయించారు.
పాఠశాలకు వచ్చిన చిన్నారులు ఇంటి వాతావరణాన్ని మైమరిచిపోయి పాఠశాల వాతావరణంలో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ చదువుకునేందుకు దాతల సహకారంతో క్రీడా పరికరాలు సమకూర్చి వాటిని విద్యార్థులు వినియోగించుకునే విధంగా చేస్తున్నారు. పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా డిజిటల్ తరగతులు, టీవీ ద్వారా ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాలను విద్యార్థులు చూపేందుకు ల్యాప్ టాప్, ఎల్ఈడీ టీవీ, ప్రత్యేకంగా డిష్, విద్యార్థులు కింద కూర్చోకుండా డెస్క్‌లతో కూడిన బెంచీలు, బుక్స్, బ్యాగ్స్, నోటు పుస్తకాలు, అల్పాహారం, క్రీడా పరికరాలను ప్రజలను చైతన్య పరిచి వారి ద్వారా పాఠశాలకు సమకూర్చగలిగారు.
బెక్కర ప్రాథమిక పాఠశాలలో అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాల వాతావరణం, దాతల ఔదార్యం, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తల్లిదండ్రుల భాగస్వామ్యం వెరసి పాఠశాల రోల్ మోడల్ పాఠశాలగా ఎంపికైంది. హెచ్ఎం, సర్పంచ్ పాఠశాల అభివృద్ధికి తీవ్రంగా శ్రమించడంతో ఆదర్శ పాఠశాలగా ఎంపిక కాబడి డీఈవో, ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులను అందుకున్నది.
గతంలో పదిమంది విద్యార్థులకే పరిమితమైన ఈ పాఠశాల ఇప్పుడు 75మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తుండడంతో అరబిందో సొసైటీ బెక్కెర పాఠశాలను రోల్ మోడల్ స్కూల్‌గా ఎంపిక చేసి పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాలలో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకుగాను దాతల సహకారంతో లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
పాఠశాల ఆదర్శంగా నిలువడంతో పలువురు దాతలు తమ చిన్నారుల జన్మదిన వేడుకలు పాఠశాలలో నిర్వహించి విద్యార్థులకు తమ వంతు సహకారంగా బ్యాగులు, నోటు పుస్తకాలు, పెన్నులు, తదితర వస్తువులను అందిస్తున్నారు.
బెక్కెర గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రజలందరి సహకారంతోనే ఆదర్శ పాఠశాలగా ఎంపికైంది. పాఠశాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో సర్పంచ్, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, దాతల సహకారం ఎన్నటికి మరవలేనిది. వారందరి సహకారంతోనే పాఠశాలకు గుర్తింపు వచ్చింది. విద్యార్థులకు పాఠ్యాంశాలను నాణ్యతగా బోధించడంతోపాటుగా వారిలో స్వయంగా చదువుకోవాలనే ఆసక్తిని కలిగించాం. విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నాం. గ్రామ ప్రజలు భాగస్వామ్యంతో మరింత విజయవంతంగా కొనసాగుతున్నది.
– రఘురామారావు, హెచ్ఎం బెక్కర.