మహబూబ్‌నగర్, జూలై 3: పాలమూరు..కవులకు పుట్టినిల్లుగా పేరుగాంచిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సారస్వత పరిషత్తు అత్యంత ప్రతిష్టాకంగా చేపట్టిన తెలంగాణ 33జిల్లాల సమగ్ర స్వరూప గ్రంథాల ప్రచురణలో భాగంగా రూపొందించిన మహబూబ్‌నగర్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని ఆదివారం మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన గడ్డను అభివృద్ధి చేసుకుందామని మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసినట్లు పేర్కొన్నారు. 36వ్యాసాలతో కూడిన గ్రంథంగా పాలమూరు జిల్లా చరిత్ర సమగ్రంగా రూపొందించారన్నారు. ప్రజలకు పుస్తకాల ద్వారా చరిత్ర తెలుస్తుందని, పరిషత్తు పుస్తకాల ప్రచురణకు రూ.15లక్షలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రెండువేల ఏండ్ల క్రితం మాగనూర్‌లోని ముడమాల్ నిలువురాళ్లు ఖగోళశాస్ర్తానికే సవాల్‌గా నిలువడం గొప్ప విషయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్యతోపాటు పలువురిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఎస్పీ వెంకటేశ్వర్లు, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటి గణేశ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, ప్రముఖ న్యాయవాది వీ మనోహర్‌రెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.