కొల్లాపూర్‌రూరల్, జూన్ 15: ప్రతిఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆర్డీవో హనుమానాయక్ పిలుపునిచ్చారు. తమ ఇంటి ఆవరణలో, పెరట్లో మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు. మండలంలోని రామాపురం పరిధిలోని నర్సరీని ఆర్డీవో బుధవారం సందర్శించి మొక్కలు నాటి నీళ్లుపోశారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి 10వేల మొక్కలు పెంచాలని ప్రభుత్వం నర్సరీనీ ఏర్పాటు చేసిందన్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించి నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేయాలన్నారు. ఆర్డీవో వెంట ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
లింగాల, జూన్ 15: హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ లక్ష్మమ్మ అన్నారు. మండలంలోని సూరాపూర్ శివారులోని లింగాల-అచ్చంపేట ప్రధాన రహదారికి ఇరువైపులా బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం చేట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమలుచేసి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. నాటిన మొక్కలను సంరక్షించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నేరవేరుతుందన్నారు.
అమ్రాబాద్, జూన్ 15: హరితహారం కార్యక్రమానికి మొక్కలను అందుబాటులో ఉంచాలని ఎంపీడీవో రామ్మోహన్ అన్నారు. మండలంలోని తుర్కపల్లి, మన్ననూర్, ప్రశాంత్‌నగర్ కాలనీలో బుధవారం నర్సరీలను ఆయన సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరాంనాయక్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఉప్పునుంతల, జూన్ 15: మండలంలోని హైదరాబాద్-శ్రీశైలం ప్రధానరహదారి లత్తీపూర్ స్టేజీ వద్ద హరితహారంలో భాగంగా ఎంపీడీవో విజయభాస్కర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచాలన్నారు. ప్రతిఒక్కరూ విధిగా మొక్కలను నాటాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో ఎంఈవో రామారావ్,సర్పంచ్ మల్లెష్ తదితరులు పాల్గొన్నారు.