
మక్తల్ రూరల్, జూన్ 27 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 54 వేల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు జిల్లా కొవిడ్ నియంత్రణ అధికారి డాక్టర్ సిద్ధప్ప తెలిపారు. ఆదివారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొవిడ్ టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 14 పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టినట్లు తెలిపారు. నారాయణపేట, ఉట్కూర్, మక్తల్, కోటకొండ, దామరగిద్ద, మాగనూర్, కృష్ణ, ధన్వాడ తదితర మండల కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. టీకాలు వేయించుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు. మిగితా వారు కూడా భయాన్ని వీడి టీకాలు వేయించుకోవాలని సూచించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.కోట్లు ఖర్చు పెట్టి టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో థర్డ్ వేవ్.. డేల్టాప్లస్ వ్యాపిస్తున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ వేయించరుకోవాలని కోరారు. ఇప్పటి వరకు 40 ఏండ్లు పైబడిన వారికే టీకాలు వేశామని, 18 ఏండ్లు నిండిన వారికి కూడా వేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. వారం రోజులుగా ఒకటి, రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నాయని తెలిపారు. అయినా ప్రజలు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కర్ని పీహెచ్సీలో..
కర్ని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డాక్టర్ సిద్ధప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులు టీకాలు వేయించుకోవాలన్నారు. కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆండాలమ్మ, చంద్రకళ, ఆశ వర్కర్లు జ్యోతి, అనిత పాల్గొన్నారు.