కోయిలకొండ, జూన్ 29 :రైతుబంధు సాయం రావడంతో అన్నదాతలకు సాగు రందీ తీరింది. వానకాలం పంట సాగు సమయానికి పెట్టుబడి డబ్బులు చేతికి అందడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెస్టిసైడ్ దుకాణాల వద్ద సందడి నెలకొన్నది. రెండో రోజూ బుధవారం రెండెకరాలలోపు ఉన్న రైతులకు ఖాతాల్లో డబ్బులు జమకావడంతో మరింత ఉత్సాహంగా సాగుపనుల్లో నిమగ్నమయ్యారు.
ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కావడంతో అన్నదాత మోములో చిరునవ్వు వచ్చింది. సాగుచింత తీర్చిందంటూ సంబురాలు చేసుకుంటున్నారు. వానకాలం సాగు సమయానికి చేతికి డబ్బులు అందడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి సిద్ధమవుతున్నారు. మొదటిరోజు ఎకరా, రెండోరోజు రెండెకరాలలోపు ఉన్న రైతులకు డబ్బులు జమయ్యాయి. గ్రామాలో సందడి నెలకొన్నది. ఎక్కడ చూసినా రైతులు పంట సాగు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుబంధు డబ్బుల కోసం బ్యాంకుల వద్ద బారులుదీరుతున్నారు.
మరికొందరు రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నాటే పనిలో నిమగ్నమయ్యారు. రైతుబంధు డబ్బులు తీసుకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని కోయిలకొండ ఎస్బీఐ, ఏపీజీవీబీ మేనేజర్లు వేణుగోపాల్, భాస్కర్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్బీఐతో పాటు కోయిలకొండ, పార్పల్లిలో సీఎస్పీ సెంటర్లు ఏర్పాటు చేశామని, రైతులు అక్కడికి వెళ్లి డబ్బులు తీసుకోవచ్చని వెల్లడించారు. గ్రామాల్లో ఏపీజీవీబీ మిత్రలను ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా, రైతుబంధు డబ్బులు తీసుకొన్న వారు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు బారులుదీరారు. దీంతో ఎరువులు, విత్తన దుకాణాల వద్ద రద్దీ నెలకొన్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని దుకాణాల యజమానులు తెలిపారు.
లావోడి బాధ తీరింది..
పునాసలకు సాగుకోసం సీఎం కేసీఆర్ అందించినరైతుబంధుతో లావోడి బాధ తీరింది. నాకు ఉన్నఅరెకరంలో జొన్నలు సాగు చేసేందుకు సిద్ధమయ్యా ను. సమయానికి వానతోపాటు రైతుబంధు డబ్బులు చేతికి అందాయి. ఆ డబ్బులతో విత్తనాలు కొనుగోలు
చేశాను. పెట్టుబడి కోసం పెత్తందార్ల దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చే పరిస్థితి తప్పింది. రైతులకు సహకారం అందించి అందుకుంటున్న ముఖ్యమంత్రి సేవలు మరువలేనివి..
రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాను.
– ఆశమ్మ, మహిళా రైతు, కోతలాబాద్ , కోయిలకొండ మండలం
పొలాన్ని సిద్ధం చేస్తున్నా..
పంట సాగు కోసం పొలాన్ని సిద్ధం చేశాను.వర్షాలతోపాటు రైతుబంధు డబ్బులు ఖాతాలో జమయ్యాయి. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి కందులు సాగు చేస్తున్న. విత్తునాటే సమయానికి రైతుబంధు డబ్బులు చేతికి అందాయి. చాలా సంతోషంగా ఉన్నది. నాలాంటి అన్నదాత లకు రైతుబంధుతో పెట్టుబడి బాధ తీరింది. ఎవరి దగ్గరా చేయి చాచాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
సమయానికి అందిన డబ్బులు..
వానకాలం సాగు పెట్టుబడి సమయానికి రైతుబంధు డబ్బులు చేతికందాయి. నాకు ఉన్న 28 గుంటల్లో జొన్న, కందులు సాగు చేస్తున్నా. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలుసుకొని రైతుబంధు అందించడం సంతోషంగా ఉన్నది. ఒకరి దగ్గర చేయి చాచాల్సిన బాధ తప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– రామకృష్ణ, రైతు, మోదీపూర్
అవసరానికి రైతుబంధు..
రైతులకు పంటసాగుకు ముందే అవసరానికి రైతుబంధు డబ్బులు చేతికి అందాయి. రైతుబంధుతో పెట్టుబడికి అప్పులు తెచ్చే పరిస్థితి పోయింది. సంతోషంగా సాగు చేస్తున్నం. నాకున్న పొలంలో వరి వేసేందుకు తుకం కడుతున్న. రైతుల బాధలు తీరుస్తున్న సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మా లాంటి రైతులకు అండగా నిలుస్తున్నారు.
– ఆంజనేయులు, రైతు, కోయిలకొండ