శ్రీశైలం, జూలై 31 : శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం డ్యాం ఎనిమిది గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి 2,58,285 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 19,272, సుంకేశుల నుంచి 16,256 క్యుసెక్కుల నీరు విడుదల కాగా, రిజర్వాయర్‌కు 3,62,411 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది.
8గేట్ల ద్వారా 2,23,128 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 24,917, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న నాగార్జుసాగర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 884.50 అడుగులు, 215 టీఎంసీలకు ప్రస్తుతం 212.9198 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు చెప్పారు.
గద్వాల/అయిజ, జూలై 31 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొ క్కుతున్నది. బుధవారం జూరాలకు 3,10, 000 ఇన్‌ఫ్లో రాగా 39గేట్లు ఎత్తి దిగువకు 2,83,080 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుదుత్పత్తికి 19,272 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్‌కు-2కు 750, జూరాల ఎడమ కాల్వకు 820, కుడికాల్వకు 652, కోయిల్‌సాగర్‌కు 630, సమాంతర కాల్వకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516మీటర్లు కాగా ప్రస్తుతం 317.820 మీటర్లుగా ఉన్నది.
పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.164 టీఎంసీలు ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 1,06,888 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,58,040క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 97.945 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. 1,633 అడుగుల నీటిమట్టానికి గానూ ప్రస్తుతం 1,631.02అడుగులు ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు 48,370 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 47,800క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది.
ఆర్డీఎస్ ఆయకట్టుకు 570 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా ప్రస్తుతం ఆనకట్టలో 11అడుగుల మేరకు నీటిమట్టం ఉన్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 3,50,000 క్యూసెక్కులు చేరుతుండగా, అవుట్ ఫ్లో 3,50,000 నమోదైంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,35,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,33,740 క్యూసెక్కులు నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో డ్యాం పరిసరాలకు చేరుకొని నీటి తుంపరలో తడుస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే గేట్ల నుంచి పాల నురగను తలపించే ప్రవాహాన్ని తిలకిస్తూ ఉల్లాసంగా గడిపారు. నీటి తుంపరలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. ఘాట్ రోడ్లో కిలోమీటర్లమేర ట్రాఫిక్ జాం అయ్యింది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవీని భక్తులు దర్శించుకున్నారు.