పెంట్లవెల్లి, ఫిబ్రవరి 21 : బీజేపీ చేపట్టిన ప్రజాగోస, కార్నర్ మీటింగ్ సభలో రసాభాస చోటు చేసుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంగళవారం కమలం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సభ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నేత, మాజీ ఎంపీ వివేక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు సభకు హాజరయ్యారు. ఈ సమయంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మండల అధ్యక్షుడు బత్తిని కురుమయ్య ఆధ్వర్యంలో వివేక్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ అధిష్టానానికి మాజీ ఎంపీ వివేక్ తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ విషయంలో స్పష్టమైన సమాధానాన్ని చెప్పాలని ఆయన్ను వారు నిలదీశారు. చిలికి చిలికి గాలివానలా ఈ విషయం కాస్తా పెద్దదవడంతో బీజేపీ, ఎమ్మార్పీఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
వెంటనే పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు యత్నించినా లాభం లేకపోయింది. చేసేది లేక బీజేపీ ప్రజాగోస సభ మధ్యలోనే ప్రసంగాన్ని నిలిపివేసి వివేక్, ఎల్లేని వెళ్లిపోతుండగా.. స్పష్టమైన సమాధానం చెప్పాలని వారిని కాన్వాయ్ వరకు ఎమ్మార్పీఎస్ నేతలు వెంబడించారు. పెద్దగా నినాదాలు చేస్తూ దళితుల ద్రోహీ.. వివేక్, బీజేపీ డౌన్.. డౌన్ అంటూ నినదించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. ఆగ్రహించిన దండోరా నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలు అమలులో ఉండగా.. బీజేపీ నాయకులు మీటింగ్ ఎలా పెడుతారని ధ్వజమెత్తారు. అధికారులు ఏ విధంగా వీరికి అనుమతినిచ్చారని నిలదీశారు. 15 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఎస్సై రామేశ్వర్‌రెడ్డి కల్పించుకొని ఎమ్మార్పీఎస్ నాయకులకు సర్ది చెప్పారు. దీంతో వారు శాంతించడంతో గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రమేశ్, బత్తిని కురుమయ్య, నాయకులు పరమేశ్, కురుమయ్య, అగ్రస్వామితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.