Junior Civil Judge | గట్టు : విద్యా ఉద్యోగ అవకాశాల్లో గట్టు మండలం దూసుకుపోతుంది. అక్షరాస్యత, విద్యాభివృద్ధిలో గట్టు వెనకబడలేదు.. జెట్ స్పీడులా దూసుకుపోతుందని నిరూపిస్తున్నారు గట్టు మండల వాసులు. తాజాగా బుధవారం వెలువడిన జూనియర్ సివిల్ జడ్జి నియామక ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 44 మంది ఎంపిక కాగా మండల కేంద్రం గట్టుకు చెందిన స్వర్ణ మల్లిక ఒకరు. న్యాయవాది సురేష్, రజితల కూతురే స్వర్ణ మల్లిక. ఒకటి నుంచి పది వరకు గద్వాలలోని శ్రీ సత్య సాయి విద్యా నిలయంలో, ఇంటర్ హైదరాబాదులో, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఈమె సోదరుడు కూడా న్యాయవాది. ఈ సందర్భంగా గట్టు సురేష్ మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి జడ్జి కావాలనే తపన తన కూతురుకుండేదని చెప్పుకొచ్చారు. కూతురు జడ్జిగా ఎంపిక కావడం తండ్రిగా, న్యాయవాదిగా చాలా ఆనందాన్ని ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.