కొల్లాపూర్, అక్టోబర్ 7 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐలో మొదటి లిఫ్ట్ ఒకటో మోటర్ నుంచి పంపింగ్‌ను అధికారులు శుక్రవారం రాత్రి తిరిగి షురూ చేశారు. సర్జ్‌పూల్‌లో ఉన్న జలాలను పంప్‌హౌస్‌లోని మోటర్ ఎత్తిపోస్తున్నది. కొండలను దాటుకొని.. పైపులను ఎగబాకుతూ కృష్ణమ్మ బిరబిరా తరలివస్తున్నది. డెలివరి సిస్టర్న్ నుంచి నురగలు కక్కుతూ పరవళ్లు తొక్కుతున్నది. దీంతో అంజనగిరి రిజర్వాయర్‌లోకి పరుగులు పెట్టింది. శనివారం సాయంత్రానికి 1.6 టీఎంసీల నీరు చేరినట్లు ఇరిగేషన్ శాఖ డీఈఈ లోకిలాల్ తెలిపారు. గత నెల 16న సీఎం కేసీఆర్ వెట్న్‌న్రు ప్రారంభించి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే.. తర్వాత రెండో సారి గత నెల 27వ తేదీన మోటర్ ద్వారా నీటి తోడివేత ప్రక్రియ మొదలుపెట్టి తర్వాత ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం నిలిపివేశారు. నాలుగు రోజుల తర్వాత మళ్లీ మోటర్‌ను ఆన్ చేయడంతో నీలవేణి జలసరాగాలను సంతరించుకున్నది. గలగల పారుతూ అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరుతున్నది. నాలుగు రోజుల పాటు నీటి పంపింగ్ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. నీటి రాకతో రిజర్వాయర్ జలకళను సంతరించుకున్నది. ఓ పక్క ఎంజీకేఎల్ మొదటి లిఫ్ట్‌లో భాగంగా నిర్మించిన ఎల్లూరు రిజర్వాయర్.. దాన్ని అనుసరించే మరోపక్క అంజనగిరి రిజర్వాయర్ జలదృశ్యాన్ని సాక్షాత్కరిస్తున్నాయి. కృష్ణమ్మను తాకిన నల్లమల కొండలు పులకరించిపోయాయి. రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కష్టాలు పూర్తిగా తీరనున్నాయని మొలచింతపల్లి, ముక్కిడిగుండం, కొత్త అంజనగిరి, ఎర్రగట్టు బొల్లారం, గిరిజన తండాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వివిధ జిల్లాల నుంచి రైతులు, ప్రజలు ప్రాజెక్టును తిలకించేందుకు తరలివస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం మహా అద్భుతమని, రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌కు జయహో అంటున్నారు.
నాలుగు రోజులపాటు పంపింగ్..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద నిర్మించిన ప్రాజెక్టులో శుక్రవారం రాత్రి ఒక మోటరు ద్వారా పంపింగ్ ప్రారంభమైంది. ఈ మోటరును మరో నాలుగు రోజులపాటు నడుపుతాం. దీంతో అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఈ దఫా 2టీఎంసీల సామర్థ్యం మేరకు నీటిని నింపుతాం. నీటితో బండ్ పటిష్టమవుతుంది.
– లోకిలాల్, డీఈ, నీటిపారుదలశాఖ
ఎంతో ఆనందంగా ఉంది..
అంజనగిరి గ్రామం పచ్చని రెండు కొండలను కలుపుతూ 74మీటర్లతో ఎత్తు క ట్టను నిర్మించారు. అంజనగిరి రిజర్వాయర్‌లోకి కృష్ణానది జలాలు తరలిరావడంతో జలసంద్రంగా మారింది. మాకు సాగునీటికి ఆయకట్టు లేకపోయినప్పటికీ శాశ్వత తాగునీటి సమస్య తీరనున్నది. తెలంగాణ సర్కార్ ఎంతో సాహాసోపేతంగా నిర్మించిన అంజనగిరి రిజర్వాయర్‌తో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తుంది.
– కిషన్, రైతు, ఎర్రగట్టు, బొల్లారం