భూత్పూర్ : భూభారతి( Bhubharati ) ద్వారా భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించు కోవచ్చని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy ) అన్నారు. బుధవారం మండలంలోని కరివెన గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. భూభారతిలో స్థానికంగా తహసీల్ కార్యాలయంలోనే సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ఉన్నాయని వెల్లడించారు.
భూ సమస్యలకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్ట పరిహారంగా ఎకరాకు రూ.10 వేలను త్వరలోనే చెక్కుల రూపంలో పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, ఆర్ఐ వెంకటేష్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.