మానవపాడు, సెప్టెంబర్ 28: ‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిని వేలం వేశారు.. నేను వేలంలో సొంత చేసుకున్నా.. అది నేను చేసిన తప్పా.. రెండేడ్లుగా పొలం నాకు స్వాధీన పర్చకుండా కోఆపరేటీవ్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. నాకు న్యాయం జరిగే వరకు కార్యాలయానికి ఎవరూ రాకూడదు.. నాకు న్యాయం జరగకుంటే అధికారుల పేర్లు చెప్పి కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటా’.. అని ఓ రైతు కోఆపరేటీవ్ కార్యాలయానికి తాళం వేశాడు. వివరాలు ఇలా..
మానవపాడు మండలం పెద్దపోతులపాడుకు చెందిన చంద్రకాంత్‌రెడ్డి తన సోదరుడు పేరు మీద ఉన్న సర్వేనెంబర్ 75ఏ, 76ఏ 6ను తనఖా పెట్టి ట్రాక్టర్, పండ్ల తోటల రుణాలు పొందాడు.
నాటి నిబంధనల మేరకు రుణం చెల్లించకపోవడంతో ట్రాక్టర్‌ను వేలం వేసి కొంత మేరకు రుణానికి జమ చేశారు. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రుణం చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చి, పేపర్ ప్రకటన ఇచ్చి సదరు భూమిని ప్రభుత్వ నిబంధనల మేరకు వేలం వేస్తున్నట్లు కోఆపరేటీవ్ అధికారులు ప్రకటించారు. 2023 జూన్ 9న స్థానిక కార్యాలయంలో అధికారుల సమక్షంలో వేలం నిర్వహించారు.
మండల కేంద్రానికి చెందిన రైతు సాయిబాబా వేలంలో ఎకరాకు రూ.12.10 లక్షలకు భూమిని కొనుగోలు చేసి రూ.36.30 లక్షలను జమ చేశాడు. అధికారులు అదే ఏడాది సెప్టెంబర్ 25న భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. పొలానికి సంబంధించిన పట్టా పాసుపుస్తకాలు రైతుకు వచ్చాయి. కానీ నాటి ఆ రైతుకు కష్టాలు మొదలయ్యాయి. పొలాన్ని సాగు చేసి విత్తనాలు నాటిన రుణం చెల్లించని రైతు పంటను మూడు సార్లు నాశనం చేశాడు. దీంతో సాయిబాబా పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్పీ, కోఆపరేటీవ్ కార్యాలయం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
దీంతో శనివారం స్థానిక కోఆపరేటీవ్ కార్యాలయానికి చేరుకున్న రైతు సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా కార్యాలయానికి తాళం వేశాడు. చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. కోఆపరేటీవ్ సిబ్బంది మాకు సంబంధం లేదని చేతులెత్తేశారని.. నాకు ఎవరు న్యాయం చేస్తారని రైతు నిలదీశాడు. నా డబ్బు పోయింది.. పొలం దక్కలేదం టూ ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కారమ య్యే వరకు కార్యాలయం తెరవనీయనని, లేకుంటే అందరి సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అయితే అధికారులు మాత్రం మా చేతుల్లో ఏమీ లేదంటూ అక్క డి నుంచి జారుకున్నారు. రైతు మాత్రం కార్యాలయాన్ని తెరవనిచ్చేది లేదని తెగేసి చెప్పాడు.