జడ్చర్లటౌన్, ఆగస్టు 22 : ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.16 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచి ఇప్పిస్తానని ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు విడిచిపెట్టేదిలేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. అంతేకాకుండా భూనిర్వాసితులకు ఎకరాకు రూ. 15 లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే నిర్వాసితుల తరఫున తాను పోరాటం చేస్తానని చెప్పారు. శుక్రవారం జడ్చర్ల పట్టణ శివారులోని రంగనాయకస్వామి గుట్టపై అవంతిక-2 సినిమా షూటింగ్ ముహూర్తం షార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్లూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిద్దామని అనుకున్న తనపై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నా ఊరుకున్నామన్నారు.
వెనుకబడ్డ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఉద్దేశంతో కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరీ చేయిస్తే కాంగ్రెసోళ్లూ కోర్టులకెళ్లి ఎన్నో అటంకాలు సృష్టించినా వాటిని అధికమించి దాదాపు 80 శాతం పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయించారన్నారు. భూసేకరణలో కొంత ఆలస్యమవటం తో ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు ఆలస్యంగా ప్రా రంభమైన దాదాపు 70 శాతం పనులు పూర్తయినట్లు చె ప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 5శాతం కాలేదన్నారు. ఎన్నికలప్పుడూ ఉదండాపూర్ నిర్వాసితులకు ఎకరాకు రూ. 15 లక్షలు ఇప్పిస్తానని, ఇండ్ల ప్యాకేజీ కింద రూ. 25 లక్షలు ఇప్పిస్తానని డైలాగులు చెప్పటమేకాకుండా అన్ని పనులు ఏడాదిలో పూర్తిచేస్తానని వాగ్ధానం ఇచ్చావు.. రెండేళ్లు అయినా పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. నీవు సమర్థుడైతే ఎ న్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మూడాను తెచ్చి రూ.30 కోట్లు నిధులు తీసుకొచ్చామన్నారు.
ముడా నిధులను మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మళ్లీంచాలని రాసి ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఎక్కడ రాసి ఇచ్చానో చూపించాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల పట్టణ శివారులోని రంగనాయకస్వామి గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకుగానూ గుట్టపైకి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. అంతేకాకుండా సూదుర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రంగనాయకస్వామిని దర్శించుకోవటమే కాకుం డా రోజంతా ఇక్కడే ఆహ్లాదకరంగా గడిపేందుకుగానూ పార్కు ఏర్పా టు కోసం రూ. 1.20 కోట్లు మం జూరీ చే యించినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నోళ్లూ పట్టించుకోలేదు.
పనులు పూర్తికావాలంటే ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేకు పూర్తి బాధ్యత, అధికారాలుంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఓ అసమర్థుడు, దద్దమ్మ అయిన వ్యక్తిని ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించుకోవటం జరిగిందన్నారు. అసమర్థ ఎమ్మెల్యే చేతగానీతనంతో పార్కు పనులు పూర్తికాలేదన్నారు. బీఆర్ఎస్ హయంలోనే నియోజకవర్గంలో మంజూరైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి టెంకాయలు కొడుతున్నాడే తప్పా కొత్తగా అభివృద్ధి పనులు తెచ్చిందేమిలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్య లు సరికావని, గతంలో ఇక్కడ ఇలాంటి సంప్రదాయం లేదని ప్రజలే చర్చించుకుంటున్నారని తెలిపారు.
జడ్చర్లలోని రంగనాయకస్వామి ఆలయం ప్రాంగణం లో అవంతిక-2 సినిమా షూటింగ్ ముహూర్తం షార్ట్ ను జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి రంగనాయకస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కాల్వరాంరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సినిమా క్రియేటివ్ ఫణీరాజ్గౌడ్, నటి అనురాధ, కెమెరామెన్ రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్ రవివర్మ, యాక్టర్ దేవరాజ్, కార్తీకేయ, చక్రవర్తుల వెంకటరమణాచార్యులు, మాజీ జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.