జడ్చర్ల, ఏప్రిల్ 1 : జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండపేటలో శనివారం రాత్రి మహిళపై జరిగిన సామూహిక లైంగికదాడి ఘటనను ఖండించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మంగళవారం ప్రకటనలో కోరారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, జడ్చర్ల నియోజకవర్గంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
లైంగికదాడి ఘటనలో ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని, పోలీసులు అన్ని రకాలుగా ఆధారాలను సేకరించి నిందితులు ఎవరైనా వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. నేర స్థలంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు పక్కాగా దర్యాఫ్తు చేయాలని పోలీసులను కోరారు. ప్రభుత్వం బాధితురాలిని ఆదుకోవాలని, అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.