జడ్చర్లటౌన్, మే 1 : కార్మికుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు అందాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జడ్చర్లలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని గంజ్ ఏరియాలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్టీయూ జెండాను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్మికుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. కర్షక, కార్మికులు తమ చెమట చుక్కలను ఇంధనంగా మార్చి, ప్రగతి రథాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. కార్మికులకు అన్ని విధాలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా కార్మికులను సన్మానించి బహుమతులను అందజేశారు. అదే విధంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జడ్చర్ల ప్రభుత్వ ఏరియా దవాఖాన వద్ద ఏఐటీయూసీ జెండాను జిల్లా మహిళా అధ్యక్షురాలు శాంతకుమారి ఎగురవేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు భాగీ కృష్ణయ్య, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్కోడ్లను తీసుకొచ్చి కార్మికుల మనుగడకు సమాధులు తీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ రంగంలో కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాలడుగు సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ పాల్గొని మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్దంకావాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ ఆఫీసు నుంచి నేతాజీ చౌరస్తా వరకు మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య, యూటీఎఫ్ జిల్లా నాయకులు నర్సింలు, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కలీం, కార్మిక సంఘం జిల్లా నాయకులు జగన్ పాల్గొని కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.